నర్తనం జీవితం పరివర్తనం!

నర్తనం జీవితం పరివర్తనం!


ఈ తరంవారు దూరమవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేందుకు, నడవడిక, క్రమశిక్షణ అలవర్చేందుకు ఒక చక్కటి అవకాశం శాస్త్రీయ నృత్యం. మానసిక పరివర్తన మెరుగుపడేందుకు, ఏకాగ్రత పెరిగేందుకూ ఇది ఎంతో ఉపయోగకరం. మదిలోని హావాభావాలన్నీ కళ్లల్లో ఒలకబోస్తూ చేసే నృత్యరూపకాలు.. చూసే వారి మదికి ఎంతో ప్రశాం తతనిస్తాయి. ప్రతి భంగిమలో ఓ నేపథ్యం, ఓ యోగాసనం ఇలా ఎన్నో దాగున్నాయి. అందుకేనేమో తల్లిదండ్రులంతా వారి పిల్లలను శాస్త్రీయ నృత్యం అభ్యసించేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆసక్తిని గమనించి పలు ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా నృత్యశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

 


- క్రమశిక్షణకు కేరాఫ్ శాస్త్రీయ నృత్యం

- నేటితరం పిల్లల్లో పెరుగుతున్న ఆసక్తి

- ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

న్యూఢిల్లీ: భారతీయ నాట్యం ఒక కళే కాదు... క్రమశిక్షణ గల జీవితానికి ఒక ఒక కొలమానం. కూచి పూడి, భరతనాట్యం, జానపదాలు ఏవైనా సరే ఏకాగ్రత, క్రమశిక్షణతో చేయడం వల్ల పిల్లల భవిష్యత్ బంగారు బాటకు అవి పునాది అవుతాయి. శాస్త్రీయ నృత్యకళపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. తాము నేర్వని కళను పిల్లలకు నేర్పించాలన్న తపన పెరుగుతోంది. ఇటీవల పలు విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలే ఇందుకు తార్కాణాలు. విద్యార్థులు కూడా ఈ నృత్యాలను నేర్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలోని పలు విద్యాసంస్థలు ప్రత్యేకంగా డ్యాన్స్‌మాస్టర్లను ఏర్పాటు చేసి నృత్యశిక్షణ కోసం తరగతులు నిర్వహిస్తున్నారు.

 

ప్రైవేటు పాఠశాలలేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల ల్లోనూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిమేరకు డ్యాన్స్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి పిల్లలకు తరగతి గదుల్లో నిర్వహిస్తున్న డ్యాన్స్ క్లాస్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సంపన్నవర్గాల పిల్లల డ్యాన్స్ మాస్టర్లు నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరై విద్య నేర్చుకుంటున్నా రు. అందుకు కారణం డ్యాన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలుండడమే... అందుకే ఇప్పుడు అందరిలో భారతీయ నృత్యంపై ఆసక్తి పెరిగింది. ఇందుకు కారణాలేమిటనే విషయమై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు వారి మాటల్లోనే...

 

దేవతలంతా మెచ్చిన కళ

నాట్యం భగవంతుడు మెచ్చిన కళ. 64 కళలల్లో ప్రతి ఒక్క దేవతా స్వరూపం ఈ కళను ఎంతో ఇష్టపడ్డారని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. నేను 1997 లో నృత్యశిక్షణా తరగతులు ప్రారంభించాను. ఇప్పటిదాకా 200 మందికి పైగా శిక్షణ అందించాను. వారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించారు. ప్రస్తుతం నా వద్ద ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులు, 86 మంది బాల బాలికలు శిక్షణ పొందుతున్నారు. పిల్లలతో పాటు పెద్దలూ నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే ఉపయోగం ఉంటుందని వైద్యులూ సూచిస్తున్నారు.

 - భార్గవకుమార్, నృత్యజ్యోతి ఫైన్ ఆర్ట్స్ డెవలప్‌మెంట్ అసోసియేషన్

 

వ్యక్తిత్వం అలవడుతుంది

శాస్త్రీయ నృత్యం వల్ల భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురిం చి అవగాహన పెరుగుతుంది. ఫలితంగా మంచి నడవడిక, క్రమశిక్షణ గల జీవితం అలవడుతుంది. నేను 2000 సంవత్సరం నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. సెయింట్ జోసఫ్ స్కూల్‌లో ఇప్పటి వరకు 400 మంది పిల్లలకు నృత్యరీతులలో శిక్షణ ఇచ్చాను. ఇంటి వద్ద కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. పలువురు డాక్టర్లు, గృహిణిలు సైతం నృత్యం నేర్చుకోవడానికి వస్తున్నారు. నాట్యం వల్ల పిల్లల్లో మానసిక పరివర్తన వస్తుంది.

 - ఎస్. కరీముల్లా, నటరాజ నృత్య కళామందిరం

 

ప్రయోజనాలివీ...

పిల్లల్లో మానసిక పరివర్తన వస్తుంది.భారతీయ ఇతిహాసాలను నృత్యరూపక ప్రదర్శన చేయడం వల్ల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుంది.తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవభావం పెరుగుతుంది.నాట్యంలో యోగా దాగుంది, తద్వారా ఆరోగ్యం సిద్దిస్తుంది.శారీరక,మానసిక వ్యాయా మం చేకూరుతుంది. ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు.కళలు, సంప్రదాయంపై అభిరుచి పెరుగుతుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top