చచ్చినట్లు ...35 బక్కెట్ల నీళ్లు ఇవ్వాల్సిందే

చచ్చినట్లు ...35 బక్కెట్ల నీళ్లు ఇవ్వాల్సిందే


మనిషికి గాలిలోని ఆక్సిజన్ తరువాత అతి ముఖ్యమైనది నీరు.  అలాంటి నీటి కోసం భవిష్యత్‌లో యుద్ధాలు చేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ప్రపంచ దేశాల సంగతి ఏమోకానీ భారత్ లోనూ ఆ సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో నీటి సమస్య వేధిస్తోంది.  అసలే తాగునీటి కొరతతో అల్లాడుతున్న అక్కడ గ్రామీణులకు బందిపోట్ల నుంచి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. అది కూడా తాగునీటి కోసం అంటే నమ్మరేమో. బందిపోట్లకు ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు. దాంతో ఆ ప్రాంత గ్రామస్తుల నీటి కష్టాలు వారి ప్రాణాల మీదకు తెస్తోంది.



బుందేల్‌ఖండ్ ప్రాంత ప్రజలు ఓవైపు కరువు ఛాయలు, మరోవైపు తాగునీటికి కటకటలాడే దుస్థితి ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి బందిపోట్లు ఓ షరతు విధించారు. అది ఆషామాషీ షరతు కానే కాదు....ఏకంగా  రోజుకు 35 బకెట్ల తాగునీటిని తమకు సరఫరా చేయాలని అక్కడ 28 గ్రామల ప్రజలకు హుకుం చేశారు. దీనిని రోజువారీ ‘నీటిపన్ను’గా వారు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో గ్రామం వంతుల వారీగా కరువుకాలంలోనూ చచ్చి.. చెడి 35 బకెట్ల నీటిని బందిపోట్లకు సరఫరా చేస్తోంది. ఇందు కోసం మైళ్ల కొద్ది నడిచి ఈ నీటిని సేకరిస్తోంది.



నిజానికి దశాబ్దాల కిందటే బందిపోటు దొంగల సంస్కృతి దేశంలో చాలావరకు తగ్గిపోయింది. అయినా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కొద్దిసంఖ్యలో ఉన్న బందిపోట్లు ఇంకా ఆగడాలు కొనసాగిస్తున్నారు. ఆహారం, తాగునీరు, ఆశ్రయం కోసం గ్రామాలపై విరుచుకుపడుతున్నారు. బందిపోటు ముఠా నాయకుడి ఆచూకీ చెప్తే పెద్ద ఎత్తున రివార్డు ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది.



 అయితే దట్టమైన అడవి ప్రాంతాన్ని తమ ఆవాసంగా చేసుకొని అమాయక గ్రామీణ ప్రజలను బెదిరించి బతకడమే ఈ బందిపోట్లకు ధ్యేయంగా మారింది. ఇక దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అక్కడ పోలీసులు చెబుతున్నారు. ఇక నీటి కష్టాలు ఎలా ఉంటాయంటే ....నీళ్లు లేవని కొన్ని ప్రాంతాలలో యువకులకు పెళ్లిళ్లు కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఆప్రాంతపు యువకులకు తమ ఆడపిల్లలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవటంతో వారు బ్రహ్మచారులుగానే మిగిలిపోవాల్సి వస్తోంది.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top