ఆ గదిలో కోట్లు కురిశాయి

ఆ గదిలో కోట్లు కురిశాయి


► కోల్‌కతాలో చిన్న గది నుంచి కార్యకలాపాలు

► హవాలా రూపంలో తరలిన వందల కోట్లు




సాక్షి, విశాఖపట్నం:

కోల్‌కతాలో ఓ చిన్న గది.. అయి తేనేం అందులోనే రూ.వందల కోట్ల విలువైన కంపెనీలున్నాయి.. కానీ అవి కంటికి కనిపించవు... కేవలం పేపర్లపైనే కనిపిస్తాయి.. హవాలా యువకుడు మహేష్‌ గురించి ఆరా తీస్తున్న ఐటీ, పోలీస్‌ అధికారులకు విస్తుపోయే విషయాలెన్నో తెలుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురంలో పుట్టి, ఉల్లిపాయల వ్యాపారం చేసుకుని బతికే సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్‌ రూ.వందల కోట్ల హవాలా రాకెట్‌ను నడిపే స్థాయికి ఎదిగాడు. శ్రీకాకుళంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ స్టోన్‌ క్రషింగ్‌ మిషన్‌ నడుపుతున్నట్లు జనాన్ని నమ్మించి కోల్‌కతా నుంచి హవాలా నడిపిస్తున్నాడు.



కోల్‌కతా నుంచి విశాఖ బ్యాంకు అకౌంట్లకు నగదును మళ్లించి ఇక్కడినుంచే సింగపూర్, చైనా, హాంకాంగ్‌ దేశాలకు తరలించి హవాలా చేస్తున్నారు. నల్లధనాన్ని చెక్కుల రూపంలో తీసుకుని 12 షెల్‌ కంపెనీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ సొమ్మును మరికొన్ని కంపెనీల్లోకి మళ్లిస్తున్నారు. విశాఖలోని 22 బ్యాంకుల్లో తప్పుడు పత్రా లతో ఖాతాలు తెరిచి కోట్లాది రూపాయలు వాటిలో జమచేస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా విదేశాలకు పంపి స్తున్నారు. ఇలా ఒకే బ్యాంకు అకౌంట్‌లో వివిధ అకౌంట్ల నుంచి రూ.570 కోట్లు జమ అయినప్పటికీ అధికారుల కు అనుమానం రాలేదు. ఆ ధైర్యంతోనే మరో రూ.97 కోట్లు అదే ఖాతాలో జమచేశారు. వాటిని చూసిన అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు.



నెల రోజులుగా నిఘా

మహేష్‌ లావాదేవీలపై నెల రోజుల పాటు నిఘా పెట్టా రు. ఈ నెల 9న రంగంలోకి దిగి షెల్‌ కంపెనీల కోసం జల్లెడ పట్టారు. బెంజ్‌ కారు కొనుగోలు చేయడానికి ఖాతా నుంచి డబ్బులు తీయడంతో  మహేష్‌ గుట్టు కనిపెట్టారు. తొలుత అతని తండ్రి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మహేష్‌ను అదుపులోకి తీసుకుని విశాఖ తీసుకు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన అన్న దమ్ములు రాజేష్, హరీష్‌లను కూడా అదుపులోకి తీసుకు న్నారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇంత భారీగా నల్లధనాన్ని  మార్పిడి వెనక కచ్చితంగా చాలా పెద్దవాళ్ల హస్తమే ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.



హవాలా’ మహేష్‌ అరెస్ట్‌

వందల కోట్ల రూపాయల హవాలా కేసులో ప్రథమ నిందితుడు వడ్డి మహేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు విశాఖ పోలీసులు ఆదివారం ప్రకటిం చారు. అతడిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును సీఐడీకి బదలా యించినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top