కొనుగోళ్ల ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థి

కొనుగోళ్ల ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థి - Sakshi


చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజం

 

 సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బరిలో టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టడంపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. మళ్లీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసే ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపుతున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సోమవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను కొనసాగించే క్రమంలో ఉన్నారన్నారు. కేసీఆర్‌కు తగిన బలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించారని, అలాగే చంద్రబాబూ పోటీపడి కొనుగోలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే దుర్బుద్ధి ఇదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



కానీ ప్రజలు ప్రతిపక్షమేనన్నారు. బహిరంగంగా ఫిరాయింపు నిరోధక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై కత్తి వేలాడుతోందని, మళ్లీ అదే తప్పు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆయన బాగుపడేదిలేదన్నారు. రాజకీయ వ్యూహానికి, వ్యభిచారానికి తేడాఉందని, వ్యభిచారం అంటే బతుకు కోసం చేశామంటారన్నారు. వీళ్లూ అదేఅంటే మాకు అభ్యంతరమేమీలేదన్నారు. కేంద్రంలో ఉన్న వారూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నవారేనన్నారు. వెంకయ్యనాయుడికి ప్రత్యేక హోదా శనిలాగా అంటుకుందని, అందుకే దూరం గా రాజస్తాన్ వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.



రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టుగా వెంకయ్య ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకహోదా విడిచిపెట్టదంటూ జోస్యం చెప్పారు. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడానికే మహానాడు వంటి సభలు తప్ప.. ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. 2050 వరకు అధికారంలో ఉండాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ 2019లో ముఖ్యమంత్రి అయితే చూద్దామని చెప్పారు. ప్రధాని మోదీ రెండేళ్ల పాలన ప్రజలకు శాపంగా, కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారిందని నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిలో మెల్ల మేలన్న రీతిలో అస్సాంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో బీజేపీ గెలిచిందని ఎద్దేవా చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top