లంచావతారులపై నిఘా

లంచావతారులపై నిఘా - Sakshi


 అమాత్యుల సహాయకుల  ఆమ్యామ్యాలు

తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం



 సాక్షి, భువనేశ్వర్:  కుంభకోణాల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఒకవైపు నవీన్ సర్కార్‌ను చుట్టుముడుతుంటే, మరోవైపు కొందరు మంత్రుల పీఎస్‌లు, పీఏలు లంచావతారులుగా మారడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు అమాత్యుల కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి రేట్లు, కమీషన్లు పిండేస్తున్నారు. వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారితో పాటు కాంట్రాక్టర్లకు తెరవెనుక సాయం పేరుతో నేరుగా అధికారిక పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎవరైనా నిరాకరిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. సహాయకుల దందాల జోరు ఎక్కువకావడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. మంత్రుల వద్ద పనిచేసే అనధికారిక, అధికార పీఏలు, పీఎస్‌లపై నిఘా ఏర్పాటు చేయనుంది. వారితో సమావేశం నిర్వహించి హెచ్చరిక చేయాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు.



 అంతా వారే!

 సొంత పార్టీ నేతలు పలు అవినీతి అక్రమాలకు పాల్పడడం, మంత్రులు కూడా ఇష్టానుసారం వ్యవహరించడంతో పాటు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చూసీచూడనట్లు వ్యవహరించడం ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. చిట్‌ఫండ్ అక్రమాల్లో బీజేడీ ప్రముఖులు పలువురు చిక్కుకున్నారు. మంత్రుల వద్ద పని చేసే ప్రభుత్వ, వ్యక్తిగత సిబ్బంది, సహాయకులు, ఇతరులు తమ తమ స్థాయిలో పైరవీలకు పాల్పడుతున్నారు. వీరు చేసే కార్యక్రమాలకు మంత్రి పేరు ఉపయోగిస్తున్నారు. మంత్రిగారు చెప్పారంటూ సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఫలానా పని     చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిజంగా మంత్రిగారు చెప్పారో లేదో కాని వారి సహాయకులు మాత్రం తమవద్దకు వచ్చిన వారి నుంచి రూ.లక్షల్లో కమీషన్లు పుచ్చుకుని బదిలీలు, పనులు, ఫైళ్లపై సంతకాల వరకు చక్కబెడుతున్నారు. దీనికితోడు కొందరు మైనింగ్‌కాంట్రాక్టర్లు, రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి కూడా నేరుగా అధికారులతో మాట్లాడుతున్నారు.


ఒకరిద్దరు పీఏలైతే కోట్లలో ఆస్తులు అర్జించినట్లు పలువురు అధికారులే చెబుతున్నారు. దీంతో సచివాలయంలో సామాన్యుల పనులు పక్కకు వెళ్లిపోయి పర్సంటేజీలు ఇచ్చినవారి పనులను పూర్తి చేస్తున్నారు. తమ సహాయక సిబ్బంది ఏం చేస్తున్నారో గమనించకపోవడం, తెలిసినా చూసీచూడనట్లు మంత్రులు వ్యవహరిస్తున్నారు. చివరికి పర్సంటేజీల వ్యవహారం ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమంతోంది. లంచావతారుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీంతో వారిపై నిఘా పెట్టడంతో పాటు వారికి సంబంధించిన సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top