చంద్రస్వామి కన్నుమూత

చంద్రస్వామి కన్నుమూత


► జ్యోతిష్కుడిగా ప్రసిద్ధి  పొందిన చంద్రస్వామి

► రాజీవ్‌ హత్యలోనూ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు




న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు, వివాదాస్పద జగదాచార్య చంద్రస్వామి (66) ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. మరో మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యలోనూ ‘తాంత్రిక స్వామి’ చంద్రస్వామి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యంతో ఏప్రిల్‌ 3న ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఇటీవల గుండెపోటు వచ్చిన అనంతరం, తాజాగా బహుళ అవయవ వైఫల్యాలతో మంగళవారం చంద్రస్వామి మరణించారని వైద్యులు వెల్లడించారు.


అంత్యక్రియలను బుధవారం ఉదయం 9 గంటలకు నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వద్ద నిర్వహించనున్నారు. పీవీ నరసింహా రావు ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రిగా ఉన్న చంద్రస్వామి ఆయనకు దగ్గరయ్యారు.  పీవీ ప్రధాని అయ్యాక చంద్రస్వామి ఢిల్లీలో ‘విశ్వ ధర్మయాతన్‌ సనాతన్‌’ అనే ఆశ్రమాన్ని కూడా నిర్మించారనీ, ఇందుకు స్థలాన్ని మాజీ ప్రధాని ఇందిరా గాంధీయే కేటాయించారని చెబుతారు. పీవీ నరసింహారావుకు అత్యంత నమ్మకస్తుల్లో చంద్రస్వామి ఒకరు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రస్వామి బాగా అధికారం చెలాయించేవారు. పలుసార్లు వివాదాల్లో చిక్కుకున్న ఆయనకు రాజీవ్‌ గాంధీ హత్య కేసులోనూ పాత్ర ఉన్నట్లు మిలాప్‌ చంద్‌ జైన్‌ కమిషన్‌ ఆరోపించింది.


జైన్‌ కమిషన్‌ తన నివేదికలోని ఓ భాగం మొత్తం చంద్రస్వామి పాత్ర గురించే చర్చించింది. రాజీవ్‌ గాంధీని హత్య చేసిన ఎల్‌టీటీఈకి చంద్రస్వామి నిధులు సమకూర్చినట్లు కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. రాజీవ్‌ గాంధీ హత్యకేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు. అనంతరం 2009లో ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. చంద్రస్వామిపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా పలుమార్లు వచ్చాయి. లండన్‌కు చెందిన వ్యాపారవేత్తను మోసం చేశారనే అభియోగంపై 1996లో ఆయన ఓ సారి అరెస్టయ్యారు కూడా. విదేశీ మారకద్రవ్యం నియంత్రణ చట్టం(ఫెరా)ను  చంద్రస్వామి పలుమార్లు ఉల్లంఘించినట్లుగా అభియోగాలున్నాయి. ఫెరాను ఉల్లంఘించినందుకు 2011 జూన్‌లో సుప్రీంకోర్టు చంద్రస్వామికి రూ.9 కోట్ల జరిమానా కూడా విధించింది.



మార్గరెట్‌ థాచర్‌కూ జ్యోతిష్యం

చంద్రస్వామి అసలు పేరు నేమి చంద్‌. రాజస్తాన్‌కు చెందిన ఆయన తండ్రి వడ్డీ వ్యాపారి. చంద్రస్వామి బాల్యంలోనే ఆయన కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. అనంతరం చంద్రస్వామి బిహార్‌ అడవుల్లో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి తాంత్రిక స్వామీజీగా, జ్యోతిష్కుడిగా బాగా పేరు తెచ్చుకుని ఢిల్లీ గూటికి చేరారు. నటి ఎలిజబెత్‌ టేలర్, బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్, ఆయుధ వ్యాపారి అద్నన్‌ ఖషోగ్గీ, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంలకూ ఆయన ఆధ్యాత్మిక సలహాలిచ్చే వారని చెబుతారు.


ఆయన ఆశ్రమంపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయగా, అద్నన్‌ ఖషోగ్గీకి చెల్లింపులు చేసినట్లుగా ఆధారాలూ బయటపడ్డాయి. 1975లో థాచర్‌ తన ‘కామన్స్‌ ఆఫీస్‌’లో చంద్రస్వామితో మాట్లాడినప్పుడు.. నాలుగేళ్లలో ఆమె ప్రధాని అయ్యి, దశాబ్దకాలం పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఆయన జ్యోతిష్యం చెప్పినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అనంతరం చెప్పినట్లుగానే ఆమె బ్రిటన్‌ ప్రధాని అయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top