మరమగ్గాలకు చేయూత


షోలాపూర్, న్యూస్‌లైన్ : పట్టణంలోని మరమగ్గాల పరిశ్రమల యజమానులకు శుభవార్త. ఎన్నో ఎళ్లుగా పరిశ్రమలు నడుపుతూ అప్పులపాలయ్యారు. బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు తీర్చేస్థోమత కూడా లేకుండా పోయింది. సంక్షేమం చతికిలబడింది. ఇలాంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యజమానులకు కాసింత ఊరట లభించింది. పట్టణంలోని 472 మరమగ్గాల పరిశ్రమల యజమానులకు 50 శాతం రుణ మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వస్త్ర పరిశ్రమ, సహకార, ఆర్థిక శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

 

ఈ విషయాన్ని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ధర్మన్న బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముంబైలోని సహ్యద్రి అతిథి గృహంలో సీఎం చవాన్, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ శిందే, ఎంఎల్‌ఏ ప్రణతి శిందే,ఆయా శాఖల కార్యదర్శులు మంగళవారం మరుమగ్గాల పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. మరమగ్గాల యజమానుల పలు సమస్యలను ఎమ్మెల్యే శిందే సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ‘ఈ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్యాకేజీని ప్రకటించాలి. మరమగ్గాల వారికి నాగరి సహకార బ్యాంక్ మూత పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విధించిన రుణంపై వడ్డిని తాత్కాలికంగా మాఫీ చేసి ఓటీఎస్ పథకం వర్తించేలా చూడాలని సీఎం సహకార శాఖ కార్యదర్శిని ఆదేశించారు.

 

మరమగ్గాల సహకార సంస్థలకు కూడా ఈ పథకం వర్తించే అంశంపై  మంత్రి వర్గ సమావేశానికి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. వీటితో పాటు మరమగ్గాల వారికి రుణ మాఫీ సదుపాయం, మరమగ్గాల కార్మికుల సంక్షేమ మండళ్ స్థాపించడానికి రుణ మాఫీ 50 శాతం అంటే రూ. 17 కోట్ల 50 లక్షలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని’ ధర్మన్న వివరించారు. ఈ మేరకు చేనేత సొసైటీ రుణ మాఫీ చేసేందుకు  నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  ఈ సమావేశంలో కృష్ణారి చిన్ని, కార్పొరేటర్ అనిల్ పల్లి, సింద్రం గంజి, రాజు రాఠి, చంద్రకాంత్  దయమాలతో పాటు భివండీకి చెందిన మహేష్ చిలువేరి పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top