రక్తమార్పిడితో 2234 మందికి హెచ్ఐవీ!

రక్తమార్పిడితో 2234 మందికి హెచ్ఐవీ! - Sakshi


అత్యవసర పరిస్థితిలో రక్తమార్పిడి చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. బ్లడ్‌బ్యాంకులలో రక్తాన్ని క్షుణ్ణంగా, అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే దాన్ని రోగులకు ఇస్తారు. కానీ.. రక్తమార్పిడి కారణంగానే మన దేశంలో 2234 మందికి హెచ్ఐవీ సోకింది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యలో రక్తం తీసుకుని, హెచ్ఐవీ బారిన పడినవాళ్ల సంఖ్య ఇది. ఈ విషయం సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసింది. చేతన్ కొఠారీ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. చాలావరకు బ్లడ్‌బ్యాంకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దానివల్లే ప్రజలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారని ఇటీవల వెల్లడైన ఓ నివేదికలో కూడా తెలిపారు.



2014 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 30 లక్షల యూనిట్ల రక్తాన్ని బ్లడ్‌బ్యాంకులు సేకరించాయి. వాటిలో 84 శాతం మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అయితే, ఈ రక్తాన్ని సరిగా పరీక్షించకపోవడం వల్లే 2వేల మందికి పైగా హెచ్ఐవీ బారిన పడ్డారు. అత్యధికంగా యూపీలో 361 మంది, తర్వాత గుజరాత్‌లో 292 మందికి ఈ వ్యాధి సోకింది. సేకరించిన రక్తాన్ని ఎవరికైనా ఇచ్చే ముందు తప్పనిసరిగా హెచ్‌ఐవీ, హెచ్‌బీవీ, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ లాంటి వ్యాధులు ఉన్నాయేమో పరీక్షించాలి. అయితే, హెచ్ఐవీ సోకిన 3 నెలల వరకు అది రక్తపరీక్షలో కూడా బయటపడదు. దీన్ని విండో పీరియడ్ అంటారు. అలాంటి సందర్భాల్లోనే చాలావరకు రక్తగ్రహీతలకు హెచ్ఐవీ సోకుతుందని నిపుణులు అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top