కాంగ్రెస్‌తో ఆర్థిక వ్యవస్థ నాశనం

కాంగ్రెస్‌తో ఆర్థిక వ్యవస్థ నాశనం - Sakshi

  • కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శ

  •  ప్రధాని విదేశీ పర్యటనలతో భారత్ ప్రతిష్ట పెరిగింది

  • న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలను విజయవంతం చేయటం ద్వారా అంతర్జాతీయంగా భారత కీర్తి ప్రతిష్టలను పెంపొందించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రశంసించారు. ప్రధాని విదేశీ పర్యటనల్లో ఉండగా మంత్రివర్గ సహచరులంతా అదనపు గంటలు పనిచేసి ఆయన అంచనాలకు అనుగుణంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.



    కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిందని విమర్శించారు. శారదా చిట్ కుంభకోణానికి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతల విచారణ, అరెస్టు వ్యవహారంపై ఆ పార్టీ అధ్యక్షురాలు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించిన తీరు తీవ్ర అసంతృప్తి కలిగించిందన్నారు.



    లెఫ్ట్ పార్టీలను కూలదోసేందుకు పలు రాజకీయ శక్తులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాయన్నారు. తృణమూల్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించేందుకు మోసపూరిత పథకాలను ఎర వేశారన్నారు. సీఎం మమతా బెనర్జీ ఇలాంటి నేతలను కట్టడి చేయకుండా వారికి మద్దతుగా మాట్లాడటంపై చింతిస్తున్నట్లు చెప్పారు. జైట్లీ ఈమేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పలు వ్యాఖ్యలు చేశారు.



    మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజిలో ప్రధాని మోదీ పర్యటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని భావిస్తున్నట్లు చెప్పారు. బ్రిస్బేన్‌లో జీ-20 దేశాల సమావేశాల్లో భారత్, మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారన్నారు. మన ప్రతిష్ట పెరిగిందనటానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటానికి అంగీకరించటం కంటే గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు.

     

    దృఢ సంకల్పమే మోదీ బలం: ప్రధాని మోదీకి గొప్ప క్రీడాకారులకుండే దృఢ సంకల్పం ఉంటుందని, అదే ఆయన అసలు బలమని జైట్లీ తెలిపారు. ఆత్మ విశ్వాసం, కఠిన స్వీయ క్రమశిక్షణ వల్లే మోదీ అత్యున్నత స్థాయికి ఎదిగారని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మోదీ తనకున్న మంచి లక్షణాలనే అభివృద్ధి అజెండాగా మలచుకున్నారన్నారు.

     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top