‘రైతు’పై లోక్‌సభలో రచ్చ

‘రైతు’పై లోక్‌సభలో రచ్చ - Sakshi


ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న కాంగ్రెస్‌

స్వామినాథన్‌ సిఫారసులపై ఏం చేశారని ప్రశ్న

విపక్షానివి మొసలి కన్నీళ్లేనన్న కేంద్ర మంత్రి అనంత్‌

సభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌.. కోరం లేక రాజ్యసభ వాయిదా




న్యూఢిల్లీ: రైతు సమస్యలపై శుక్రవారం లోక్‌సభ వేడెక్కింది. దేశవ్యాప్తంగా అన్నదాత ఇబ్బందులకు మీరంటే మీరేనని అధికార, విపక్షాలు విమర్శించుకోవటం, స్పీకర్‌ పోడియం వద్ద నిరసనలు చేయటంతో సభ నినాదాలతో దద్దరిల్లింది. రైతులు రోడ్లపైకి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. ప్రభుత్వానికి అసలు రైతు సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించింది. ప్రధాని సమాధానం ఇవ్వని కారణంగా సభనుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం మండిపడింది. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని ప్రతివిమర్శలు చేసింది. అటు రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక సభ వాయిదా పడింది.



స్వామినాథన్‌ సిఫారసుల అమలేది?

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు దీపేందర్‌ సింగ్‌ హుడా రైతు సమస్యలపై చర్చను లేవనెత్తారు. ‘మధ్యప్రదేశ్‌ అయినా, మహారాష్ట్ర అయినా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చారు. సభలో దీనిపై చర్చ జరిగినా ప్రధాని నుంచి స్పందన లేదు’ అని ఆయన విమర్శించారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ సిఫారసులను అమలుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇంతలోనే ప్రధాని స్పందించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్‌ కాసేపు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత జీరో అవర్‌లోనూ కాంగ్రెస్‌ సభ్యులు ఇదే డిమాండ్‌తో నిరసన తెలిపింది. అనంతరం.. ప్రధాని రైతు సమస్యలపై స్పందించకపోవటంతో వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.



కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు!

స్పీకర్‌ పోడియం వద్ద కాంగ్రెస్‌ సభ్యుల నినాదాలు, హుడా ప్రసంగంపై అధికార పక్షం దీటుగానే స్పందించింది. 60 ఏళ్లుగా రైతుల కోసం కాంగ్రెస్‌ ఏం చేసిందని బీజేపీ ఎంపీలు సభలో మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా మరింత నష్టాల్లోకి వ్యవసాయాన్ని నెట్టేశారంటూ ప్రతివిమర్శలు చేశారు. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ విమర్శించారు. వ్యవసాయ సమస్యలపై బుధవారం జరిగిన చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్‌ పారిపోయిందని ఎద్దేవాచేశారు. రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురావటం మొదలు పంట బీమా వరకు ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అనంత్‌ కుమార్‌ తెలిపారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోలిస్తే దేశంలో వైద్యుల కొరత స్పష్టంగా ఉందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక్క డాక్టర్‌ కూడా లేని పరిస్థితులు దేశంలో ఉన్నాయని వైద్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పాటిల్‌ స్పష్టం చేశారు.   



రాజ్యసభలో..  సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించినప్పటికీ కొన్ని పత్రికలు, చానెళ్లు ప్రసారం చేయటంపై ఆ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ జోక్యం చేసుకుని ఆయా మీడియా సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా, ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దాలనుకోవటం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. హిందీ అధికారిక భాష అయినప్పటికీ.. అన్ని భాషలను జాతీయ భాషలుగానే గుర్తిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ ప్రకారం 38 భాషలకు త్వరలోనే అధికారిక భాష హోదా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ సరైన కోరం (కనీసం 25 మంది ఉండాల్సి ఉండగా 23 మందే సభలో ఉన్నారు) లేని కారణంగా సభ వాయిదా పడింది.



19వేల కోట్ల నల్లధనం గుర్తింపు

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ అకౌంట్లతోపాటుగా ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం (ఐసీఐజే) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.19 వేల కోట్ల భారతీయుల నల్లధనాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. ఐసీఐజే, హెచ్‌ఎస్‌బీసీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. 700 మంది భారతీయులు అనుమానాస్పదంగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై విచారణ సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. దీనికి సంబంధించిన 31 కేసుల్లో 72 ఫిర్యాదులను క్రిమినల్‌ కోర్టుల్లో దాఖలు చేసినట్లు వెల్లడించారు.



స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో ఖాతాలున్న 628 మంది భారతీయుల వివరాలను ఫ్రాన్స్‌ ప్రభుత్వం అందజేసిందన్నారు. ‘ప్రభుత్వ సంస్థల విచారణ సందర్భంగా రూ.8,437 కోట్ల నల్లధనాన్ని మే 2017 వరకు దేశానికి తీసుకొచ్చాం. 162 కేసుల్లో రూ.1,287 కోట్ల జరిమానా విధించాం. 84 కేసుల్లో 199 క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కేసులు దాఖలు చేశాం’ అని జైట్లీ వెల్లడించారు. పనామా పేపర్ల లీక్‌ సమయంలోనే (ఏప్రిల్‌ 2016లో) ప్రభుత్వం వివిధ విచారణ సంస్థల బృందం (ఎమ్‌ఏజీ)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top