నామమాత్రపు పోరులో కాంగ్రెస్‘దళితాయుధం’ మీరా కుమార్!

నామమాత్రపు పోరులో కాంగ్రెస్‘దళితాయుధం’ మీరా కుమార్! - Sakshi


కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్‌ కాంగ్రెస్‌ నాయకురాలిగా కన్నా దళిత కాంగ్రెస్‌ నేత జగజ్జీవన్‌రాం కూతురుగానే దేశ ప్రజలందరికీ తెలుసు. 15 ఏళ్లు ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్(ఐఎఫ్ఎస్)అధికారిగా పనిచేసి 1985 బిజ్నోర్(యూపీఎస్సీ రిజర్వ్డ్) ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేశారు. ఈ తొలి ఎన్నికల పోరులో అప్పటికే ప్రముఖ దళిత నేతలుగా పేరుసంపాదించిన రాంవిలాస్‌ పాస్వాన్, మాయావతిని ఓడించారు. తర్వాత బిహార్‌లోని తన తండ్రి నియోజకవర్గం సాసారాం(ఎస్సీ) నుంచి పోటీచేసి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారు.


1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని కరోల్‌బాగ్(ఎస్సీ) నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి గెలిచినా, 1999 ఎన్డీఏ ప్రభజనంలో అక్కడ ఓటమిపాలయ్యారు. మళ్లీ సొంత రాష్ట్రంలోని సాసారాం నుంచే 2004 లోక్ సభకు ఎన్నికయ్యాక మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్లో సామాజిక న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో మరోసారి సాసారాం నుంచే గెలిచి లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి మహిళా సభాపతిగా సేవలందించారు.

 


ప్రసిద్ధ విద్యాసంస్థల్లో చదువు..

డెహ్రాడూన్, జైపూర్లోని ప్రసిద్ధ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలైన ఇంద్రప్రస్త కాలేజీ, మిరాండా హౌస్‌ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. 1970లో ఐఎఫ్ఎస్‌లో చేరి అనేక దేశాల్లో దౌత్య అధికారిగా మీరా పనిచేశారు. బీహార్‌కే చెందిన తోటి ఐఎఫ్ఎస్అధికారి మంజుల్‌ కుమార్‌ను ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. మీరా దళితుల్లో చర్మకారులైన చమార్‌ సామాజికవర్గంలో పుట్టగా, మంజుల్‌ బీసీ వర్గమైన కోయిరీ(కుష్వాహ)కుటుంబంలో జన్మించారు. మార్చి 31న 72 ఏళ్లు నిండిన మీరా కుమార్‌ దంపతుల సంతానం ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.-  (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top