విదర్భపైనే ‘కాంగ్రెస్’ గురి


నాగపూర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి విదర్భ ప్రాంతంపై తిరిగి ఆశలు పెంచుకుంటోంది. 1990 నుంచి ఈ కూటమిని విదర్భ ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. గత ఐదు దఫాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. 1990లో జరిగిన ఎన్నికల్లో విదర్భలో ఉన్న 62 స్థానాల్లో కాంగ్రెస్ 25 స్థానాలను కైవసం చేసుకుంది.



 తర్వాత 1999లో 52 స్థానాలకు గాను 27ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, 2004 ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా, 2004 ఎన్నికల్లో 49 సీట్లకుగాను కాంగ్రెస్ 19 స్థానాలను, 15 స్థానాల్లో పోటీచేసిన ఎన్సీపీ 11 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎన్సీపీ కొంతమేర దెబ్బతింది. 13 స్థానాల్లో పోటీచేసి కేవలం నాలుగింటినే గెలుచుకోగలిగింది. అదే సమయంలో 48 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 24 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.



 ఇదిలా ఉండగా ఓట్ల శాతం బట్టి చూస్తే విదర్భలో 2009 ఎన్నికల్లోనే కాంగ్రెస్ 36.04 శాతం ఓట్లు (27,59,925) సంపాదించుకుంది. ఇదిలా ఉండగా 2004 ఎన్నికల్లో 49 సీట్లకు గాను 19 మాత్రమే (23,73,717 ఓట్లు) కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో 15 సీట్లలో పోటీచేసిన ఎన్సీపీ అత్యధికంగా 11 సీట్లను గెలుచుకుంది. కాగా, 1995 ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ-శివసేన కూటమికి విదర్భలోని మొత్తం 66 సీట్లలో 33 సీట్లు (బీజేపీ-22, శివసేన-11) గెలుచుకున్నాయి.



ఈ ఎన్నికల్లో కాంగ్రెస్  64 స్థానాలకు పోటీపడి 24.60 శాతం ఓట్లతో 17 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, శివసేన-బీజేపీ కూటమికి 1990లో 24.63 శాతం ఓట్లు రాగా, 1995లో 25.82 శాతం, 1999లో 33.92 శాతం, 2004లో 32.97 ఓట్లు పోలయ్యాయి. కాగా, 2009 ఎన్నికల్లో ఆ కూటమికి 33.92 శాతం ఓట్లు పడ్డాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top