కాంగ్రెస్ పరిస్థితి ఇక క్రాస్ రోడ్డేనా?

కాంగ్రెస్ పరిస్థితి ఇక క్రాస్ రోడ్డేనా? - Sakshi


టెన్‌ జనపథ్‌ .... ఒకప్పుడు కాంగ్రెస్సీయులకు ఇదే దేవాలయం. అక్కడి కనుసైగ వారికి ఆదేశం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందా? శ్రేణులు అగ్ననేతల మాట వినడం లేదా? అసోం, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్‌ ఎందుకు మార్చలేకపోతోంది? కాంగ్రెస్ పరిస్థితి ఇక క్రాస్ రోడ్డేనా?



గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో బహిరంగ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఇక పశ్చిమాన మహారాష్ట్ర లోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నారాయణ రాణే వైదొలగితే, తూర్పున అస్సాంలో ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్‌పై మంత్రి, సీనియర్ నేత హిమంత బిశ్వాస్‌ దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రుల్ని మార్చాలని తిరుగుబాటు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.



మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలే కాదు. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.   మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. దానితో పాటు బెంగాల్‌, జార్ఖండ్‌, అసోంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుగుబాట్లు తలెత్తడంతో... కాంగ్రెస్‌ నాయకత్వం తలపట్టుకుంటోంది.



మహారాష్ట్రలో మహా తిరుగుబాటుః ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించనందుకు నిరసనగా  మహారాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పృథ్వీరాజ్‌ చవాన్‌ కేబినెట్‌లో  పరిశ్రమల మంత్రి నారాయణ్‌ రాణే పదవి నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రి చవాన్‌ పనితీరుపై  ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారు. పృధ్వీరాజ్‌ చవాన్‌ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌కు ... లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన దుస్థితి ఎదురవుతుందని విరుచుకుపడ్డారు. ఆ ఓటమిలో తాను భాగస్వామి కాలేనని ప్రకటించారు.  



అస్సాంలో అల్లకల్లోలం - ఇక అసోంలో సీనియర్‌ మంత్రి హిమంత బిశ్వ శర్మ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవి తనకివ్వాలన్నది ఆయన డిమాండ్‌. పార్టీకి వ్యతిరేకంగా తాను వ్యవహరించనని హిమంతా  అంటున్నా... ఆయనకు మద్దతిస్తున్న 31 మంది ఎమ్మెల్యేలు తాము నిర్మాణత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.  మొత్తానికి అసోంలో తరుణ్‌ గొగయ్‌ది గడ్డు పరిస్థితే. 126 మంది ఎమ్మెల్యేలున్న అసోం అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 77. ఇప్పుడు ఒకరిద్దరూ అటు ఇటైనా అసోంలో కాంగ్రెస్‌ సర్కారు కూలడం ఖాయం.  అటు బెంగాల్‌లోనూ కాంగ్రెస్‌ది ఇదే పరిస్థితి. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తృణమూల్‌ కాంగ్రెస్‌లో దూరిపోయారు. అటు నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్‌ తెగదెంపులు చేసుకోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ లాల్‌సింగ్‌ రాజీనామా చేశారు. ఇంకో వైపు హర్యానా  సీఎం మార్పు కోరుతూ నిరసన గళాలు జోరందుకున్నాయి.



రాహుల్ పై అపనమ్మకమా? రాహుల్ గాంధీ నాయకత్వం పై కాంగ్రెస్ లో  నిరాశా నిస్పృహలు వ్యక్తమౌతున్నాయి. యూత్‌ కాంగ్రెస్‌ను రాహుల్‌ గాంధీ ఓ ప్రయోగశాలగా భావించి ప్రయోగాలు చేసి దాన్ని నాశనం చేశారని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ గుఫ్రాన్‌ ఆజం ఈ మధ్యే విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటముల నుంచి కాంగ్రెస్‌ ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోలేదని కాంగ్రెస్‌ మిత్రపక్షం కేరళకు చెందిన ముస్లిం లీగ్‌ తన పార్టీ పత్రిక చంద్రికలో విమర్శించింది.  కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని రాహుల్‌ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించి మోడీ హైటెక్‌ ప్రచారానికి కాంగ్రెస్‌ పావుగా మారిందని ఆరోపించింది.



మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  తుడిచిపెట్టుకుపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్‌ గడ్డుకాలమే. ఢిల్లీలోనూ కాంగ్రెస్‌ కళతప్పడం ఖాయంగా కనిపిస్తోంది.  కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద భారత రాజకీయాల గ్రాండ్ ఓల్డ్ లేడీ కాంగ్రెస్ మంచం పట్టింది. దానికి మందూ మాకూ ఇస్తారా లేక, మంచం దింపేస్తారా అన్నది కాంగ్రెస్ నేతృత్వం నిర్ణయించుకోవాలని, నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని విశ్లేషకులు అంటున్నారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top