వందేళ్లలో చల్లటి మార్చి ఇదే

వందేళ్లలో చల్లటి మార్చి ఇదే


న్యూఢిల్లీ: ఈ అకాల వర్షాల వల్ల దేశంలోని 14 రాష్ట్రాల పరిధిలో 107 లక్షల ఎకరాల్లో రబీ పంట నాశనమైంది. దేశంలో పలుచోట్ల గత రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలో సోమవారం వర్షాలు పడ్డాయి. మరో రెండు వారాలపాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయని, దేశంలోని పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని బారత వాతావరణ పరిశోధన శాఖ వర్గాలు ప్రకటించాయి. దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారత్, మధ్య భారత్ ప్రాంతంలో వర్షాల కారణంగా మార్చి నెలలో వాతావరణం చల్లగా ఉండటం గత వందేళ్లలో ఇదే మొదటిసారని వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ రాథోర్ తెలియజేశారు. మార్చి నెలలో ఎండలతో మండిపోవాల్సిన ఉత్తర భారతం కాస్త చల్లగా ఉండడం 1915 తర్వాత ఇదే మొదటిసారని ఆయన వ్యాఖ్యానించారు.



 కాశ్మీర్‌లో గతేడాదిలాగానే అకాల వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాలం నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు, రెండు రోజులపాటు కాశ్మీర్‌లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కేంద్రం కాశ్మీర్‌కు వంద మంది సభ్యులుగల విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సహాయక బృందాలను పంపించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top