‘ఉపాధి’ని సాగుతో అనుసంధానించండి

‘ఉపాధి’ని సాగుతో అనుసంధానించండి - Sakshi


రైతులకు, కూలీలకు లబ్ధి చేకూరుతుంది: నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం కేసీఆర్‌



సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టంచేశారు. ఈ పథకం కింద వ్యవసాయ కార్యకలాపాలను చేర్చి కార్మికుల వేతనాలను 50 శాతం చెల్లించాలని, మిగిలిన 50 శాతం సంబంధిత రైతులు చెల్లిస్తారని సూచించారు. ‘‘వ్యవసాయ కూలీల కొరతతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసందానిస్తే రైతులకు సకాలంలో సాయం లభించడమే కాకుండా కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది’’ అని పేర్కొన్నారు.



ఆదివారమిక్కడ రాష్ట్రపతిభవన్‌ లో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి మూడో సమావేశంలో సీఎం మాట్లాడారు. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. రూ.17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించేలా విన్నూత పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ పథకంతో రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇలాంటి పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేయూతనివ్వాలని కోరారు.



నేడు ప్రధానితో భేటీ

సోమవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ముస్లిం రిజర్వేషన్లతోపాటు రాష్ట్రానికి చెందిన పలు సమస్యలపై చర్చించనున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, తెలంగాణలో రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు చేపట్టిన పథకాలకు సాయం అందించాలని కోరనున్నారు.



ఆదాయం పెంచేందుకు ఇలా చేద్దాం..

దేశంలో రానున్న అయిదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. దేశం మొత్తాన్ని వ్యవసాయ, వాతావరణ పరిస్థితుల ఆధారంగా క్రాప్‌ కాలనీలుగా విభజించాలని సూచించారు. రైతులందరికీ కనీస మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాలన్నారు. ‘‘దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. కానీ చాలా పంటల ఉత్పాదకత పెరగలేదు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి నిరంతర పరిశోధన అవసరం. వివిధ రాష్ట్రాల్లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలకు కేంద్రం సాయం అందించాలి. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి.



వ్యవసాయ రంగానికి తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలి. ప్రస్తుత బీమా పథకాలను సంస్కరించాలి. ఆహార ధాన్యాలు, నూనె గింజలు, నూనె ఉత్పత్తుల దిగుమతులను సమగ్రంగా సమీక్షించాలి. రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ తదితర రంగాలకు ఆదాయ పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలి’’ అని సూచించారు. కాంపా (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ చట్టం) ని«ధుల విడుదలలో అడ్డంకులను తొలగించాలన్నారు. కాంపా  నిబంధనల రూపకల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో నిధుల విడుదల, వినియోగంలో కూడా జాప్యం జరుగుతోందని కేసీఆర్‌ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top