'చైనా రెడీగా ఉంది..అణ్వస్త్రాలు పాక్‌లో పెట్టింది'

'చైనా రెడీగా ఉంది..అణ్వస్త్రాలు పాక్‌లో పెట్టింది' - Sakshi


న్యూఢిల్లీ: భారత్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని సమాజ్‌వాది పార్టీ అధినేత, రక్షణశాఖ మాజీ మంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ హెచ్చరించారు. పాకిస్థాన్‌తో కలిసి భారత్‌పై దాడి చేసేందుకు చైనా సిద్ధమైందని, వెంటనే టిబెట్‌ విషయంలో తన వైఖరిని మార్చకొని టిబెట్‌కు స్వాతంత్ర్యం ఇప్పించే విషయానికి మద్దతివ్వాలని డిమాండ్‌ చేశారు. చైనా, భారత్‌ మధ్య డోక్లామ్‌ సరిహద్దు విషయంలో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బుధవారం సాయంత్రం ఆయన లోక్‌సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పొరుగు దేశం(చైనా) చేస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏమేం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.



'ఇప్పుడు భారత్‌ చైనా నుంచి పెద్ద అపాయాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నో సంవత్సరాలుగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునే ఉన్నాను. ఇప్పటికే అది భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. చైనా భారత్‌కు అతిపెద్ద ప్రత్యర్థి. కశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఏం చేసింది? పాక్‌ ఆర్మీతో చైనా కుమ్మక్కవుతోంది. భారత్‌పై దాడి చేసేందుకు ఇప్పటికే చైనా తన అణ్వాయుధాలను పాక్‌లో పాతిపెట్టి ఉంచింది. ఈ విషయం భారత ఇంటెలిజెన్స్‌కు ఇంకా బాగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు తేల్చుకోవాల్సింది టిబెట్‌ భూవివాదం కాదు. ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతివ్వాలి' అని ఆయన జీవరో అవర్‌ సమయంలో తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top