చైనాది విస్తరణ వాదం

చైనాది విస్తరణ వాదం - Sakshi


ప్రధాని మోడీ పరోక్ష వ్యాఖ్యలు  

ఆచితూచి స్పందించిన చైనా

 


టోక్యో/బీజింగ్: కొన్ని దేశాలు విస్తరణవాదాన్ని అవలంబిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అవి ఇతర దేశాలకు చెందిన సముద్ర ప్రాంతాలను కూడా ఆక్రమించడానికి సిద్ధమవుతున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. చైనాతో జపాన్‌కు ఉన్న సముద్ర వివాదాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘21వ శతాబ్దం ఆసియాది అంటున్నారు. ఈ శతాబ్దం ఎలా ఉంది? మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనకు అభివృద్ధివాదం లేదా విస్తరణవాదం కావాలా నిర్ణయించుకోవాలి. బుద్ధుడిని పూజించేవాళ్లు, అభివృద్ధివాదంపై నమ్మకమున్నవాళ్లు అభివృద్ధి చెందుతారు.

 

కానీ, మనం 18వ శతాబ్దం భావాలున్న వారిని చూస్తున్నాం. వాళ్లు ఆక్రమణల్లో నిమగ్నమైఉన్నారు. పక్క వాళ్ల సముద్ర భాగాల్లోకి ప్రవేశిస్తున్నారు’ అని ఇక్కడ సోమవారం జరిగిన భారత్, జపాన్ వ్యాపారవేత్తల సదస్సులో చైనాను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. మోడీ వ్యాఖ్యలపై చైనా ఆచితూచి స్పందించింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కిన్ గాంగ్ అన్నారు.   చైనా, భారత్ వ్యూహాత్మక భాగస్వాములని, అది ఉమ్మడి అభివృద్ధికి దోహదం చేస్తుందని మోడీ గతంలో చెప్పారని పేర్కొన్నారు.

 

రక్షణలో మరింత సహకారం

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేదిశగా భారత్-జపాన్ మరో కీలక ముందడుగు వేశాయి. ఇందుకోసం రక్షణ రంగంలో సహకారం తోపాటు పలురంగాల్లో ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంలో మరింత సహకరించుకోవాలని టోక్యోలో జరిగిన ద్వైపాక్షిక సదస్సులో ఇరుదేశాల అధినేతలు షింజో అబే, నరేంద్ర మోడీ నిర్ణయించారు. పౌర అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలను వేగవంతం చేయాలని భారత్-జపాన్ నిర్ణయించాయి. అణుశక్తి, రక్షణ సాంకేతిక సహకారానికి సంబంధించి భారత్‌కు చెందిన ఆరు అంతరిక్ష, రక్షణ సంస్థలను ‘ఎండ్ యూజర్ (సాంకేతికతను వాడుకోకుండా నిషేధించే)’ జాబితా నుంచి తొలగించేందుకు జపాన్ అంగీకరించింది. రక్షణ సహకారం, మిలటరీ ఆయుధాల విక్రయం పైనా మోడీ, షింజో అబే చర్చించారు.  

 

భారత్‌కు రూ. 2 లక్షల కోట్ల జపాన్ సాయం

టోక్యో: భారత్‌లో మౌలిక వసతుల కల్పనకు సాయమందించడానికి జపాన్ ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో రూ.2.11 లక్షల కోట్ల సహాయం అందిస్తామని భారత్‌కు జపాన్ హామీనిచ్చింది. వీటిలో అధునాతన మౌలిక వసతులు, స్మార్ట్ సిటీలు, గంగానది ప్రక్షాళన, బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు తదితరాలు ఉన్నాయి. అంతేగాక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ఉత్పత్తి రంగం, విద్యుత్, నైపుణ్యం అభివృద్ధి,  ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ముందుకొచ్చింది. సోమవారం ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని షింజో అబె సమావేశం అనంతరం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. ఐదేళ్లలో పీపీపీలో రూ.2.11 లక్షల కోట్ల సాయం చేయడానికి జపాన్ ప్రధాని ఆసక్తి కనబరుస్తున్నారని, దీనిలో విదేశీ అభివృద్ధి సహాయం(ఓడీఏ) ఉంటుందని తెలిపారు.

 

అహ్మదాబాద్, ముంబై రూట్లో హై స్పీడ్ రైల్వే ‘షిన్‌కన్‌సెన్ సిస్టం’ నిర్మాణానికి సాయమందిస్తామని జపాన్ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఆర్థిక, సాంకేతిక, నిర్వాహణకు మద్దతివ్వడానికి  జపాన్ ప్రధాని సంసిద్ధతను వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో ఐఐఎఫ్‌సీఎల్‌లో దాదాపు రూ.2,896 కోట్ల పెట్టుబడికి  హామీ ఇచ్చారు. ర వచ్చే ఏడాదిలో భారత పర్యటనకు రావాల్సిందిగా అబెను మోడీ ఆహ్వానించగా దానికి ఆయన సమ్మతించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కూడా సహకరించాలని మోడీ కోరగా.. ఇరువురికీ లబ్ధి పద్ధతికి జపాన్ సమ్మతించింది.

 

136 ఏళ్ల నాటి పాఠశాలలో..

జపాన్ విద్యావ్యవస్థను అర్థం చేసుకోవడానికి మోడీ సోమవారం టోక్యోలో 136 ఏళ్ల నుంచి నడుస్తున్న తైమీ ఎలిమెంటరీ పాఠశాలను సందర్శించారు.  అక్కడి ఉపాధ్యాయులను జపాన్ భాష నేర్పేందుకు భారత్‌కు ఆహ్వానించారు. ‘నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఆధునికత, నైతిక విద్యావిలువలు, క్రమశిక్షణను మేళవించిన జపాన్ విద్యా విధానం ఎలాకొనసాగుతోందో తెలుసుకోవాలని’ అని చెప్పారు. విద్యార్థులతో ఉల్లాసంగా గడిపిన మోడీ.. వారికి శ్రీకృష్ణుడి కథలు చెప్పారు.  విద్యార్థులతో ఏర్పాటు చేసిన మురళీ గానానికి ముగ్ధుడైన మోడీ.. శ్రీకృష్ణుడి మురళీగాన వైశిష్ట్యాన్ని విద్యార్థులకు వివరించారు. మోడీ పర్యటించినా కూడా స్కూల్లో యథావిధిగా పాఠాలు నడిచాయి. ఈ పర్యటన తర్వాత మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే చాయ్‌పేచర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.  మోడీకి జపాన్ టీ అందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top