తూటా తుపాకి నై.. ఆటా పాటా సై


మీతో ఆటలాడుతాం...మేం పాటా పాడుతాం, మీరూ మేము ఒకటే.. మధ్యలో మావోయిస్టు ఎవడురో, వాడి పీకుడేందిరో....అంటూ ఛత్తీస్‌గఢ్ పోలీసులు తుపాకులు, తూటాలను పక్కన పడేసి గిరజన ప్రాంతాల్లో కాళ్లకు గజ్జెలు కట్టి ప్రజలతో పదం కలుపుతూ దరువులేస్తూ మరీ  పాటలు పాడుతున్నారు. గిరిజనులతో మమేకమై వారిపై మావోయిస్టుల ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకు పోలీసులు అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం ఇది. దీనికోసం సుక్‌మా జిల్లాలో ఇటీవలనే ‘పోలీస్ నాట్య చేతనా మంచ్’ అనే బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. పంట కోతల సమయంలో గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి స్థానిక భాషలోనే పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నారు.



ఛత్తీస్‌గఢ్ పోలీసులు సహజంగా అధికార భాషయిన హిందీలోనే మాట్లాడతారు. బడిలో విద్యాభ్యాసం కూడా హిందీలోనే ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, సుక్‌మా జిల్లాలో అక్షరాస్యత చాలా చాలా తక్కువ. అక్కడి వారికి ఇప్పటికీ హిందీ పరాయి భాషే. వారితో మాటామాటా కలిపి కావాల్సిన సమాచారం సేకరించేందుకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో సుక్‌మా జిల్లా అదనపు ఎస్పీ (నక్సల్స్ ఆపరేషన్స్) సంతోష్ సింగ్ స్థానిక భాషలైన గోండీ, హాల్బీ, ఛత్తీస్‌గఢీలను నేర్చుకోవాలని, ఆ భాషల్లోనే నక్సల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని పోస్టర్ల రూపంలో ప్రకటించాలని రెండేళ్ల క్రితమే వ్యూహం పన్నారు. కొంతవరకు ఈ వ్యూహం ఫలించినా అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదని, వారి సాంస్కృతిక జీవనంలో భాగమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని పోలీసు అధికారులు భావించారు. అందులో భాగంగానే ఇప్పుడు పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ప్రస్తుతం వారు పాడుతున్న పాటల భావమేమిటంటే....‘మీరు అభివృద్ధిలో ఇంతగా వెనుకబడి పోవడానికి మావోయిస్టులే కారణం. వారి కారణంగానే ప్రభుత్వ ప్రాజెక్టుల ఫలాలు మీకందడం లేదు. ఇక మావోయిస్టుల ఉద్యమానికి భవిష్యత్తు లేదు. వారిలో ఎక్కువ మంది ఇప్పటికే  ప్రభుత్వ పారితోషకాలు అందుకొని ఊరిబాట పట్టారు. మరెంతో మంది తమ పిల్లాపాపలతో అడవి బాట నుంచి పల్లెబాట పడుతున్నారు’....‘నీవు నేర్పిన పాటే నీరజాక్ష’ అంటూ మావోయిస్టులకు పోలీసులు కొత్త సవాల్ విసిరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top