ట్రాఫిక్ సమస్యకు ‘షేరింగ్’తో చెక్!


 సాక్షి, ముంబై: రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాహనాల సంఖ్య తగ్గితేనే ట్రాఫిక్‌ను నియంత్రించగలమని ట్రాఫిక్ విభాగం తేల్చేయడంతో వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా రవాణా విభాగం చర్యలు తీసుకుంటోంది.



 సొంత కార్లలో ఆఫీసులకు వెళ్లేవారు ప్రజారవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తే వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సొంత వాహనాలకు బదులుగా షేర్ ట్యాక్సీలను వినియోగించుకునేలా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ముందుగా అభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు రవాణా విభాగా అధికారి ఒకరు తెలిపారు.



 వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆవరణలో షేర్ ట్యాక్సీలను అందుబాటులో ఉంచడం ద్వారా ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులంతా ఈ ట్యాక్సీని ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంత ప్రయాణికుల కోసం కూడా ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ఒకే రూట్‌లో వెళ్తున్న ట్యాక్సీల రద్దీని కూడా కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు. షేర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రావడంతో కార్లు ఉన్న వారు కూడా తమ కార్లను ఇంటి వద్దనే ఉంచుతారని, అంతేకాకుండా వీరికి పార్కింగ్ రుసుము చెల్లించే ఖర్చు కూడా తప్పుతుందని చెబుతున్నారు.



ముఖ్యంగా నవీముంబై, ఠాణే తదితర సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు షేర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ములుండ్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు, అంధేరి నుంచి చర్చ్‌గేట్ వరకు, బాంద్రా నుంచి పరేల్ వరకు షేర్ ట్యాక్సీలను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దీంతో షేర్ ఆటోల కోసం స్టాండ్‌లను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించాలని రవాణా విభాగం అధికారులు సూచించారు. ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రయాణికులకు తెలపడం కోసం ప్రకటనలు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.



 డ్రైవరు పూర్తి వివరాలతోపాటు షేర్ ఆటో చార్జీల వివరాలను ఆటో స్టాండ్లు, వెబ్‌సైట్‌లలో పొందుపర్చాలని, దీంతో ప్రయాణికులు కూడా తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన ఆటో స్టాండ్‌ను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే చాలా మంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ఖార్గర్ నుంచి పరేల్ వరకు రోజు ట్యాక్సీలో వెళ్తాను. నాతోపాటు ఈ మార్గంలో వెళ్లే మరికొంతమంది ప్రయాణికులను కూడా డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు.



అయితే నేను డ్రైవరుకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నా ఒక్కడినే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తే అతను అడిగినంత చార్జీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మరికొంత మంది ట్యాక్సీలో ఎక్కడం ద్వారా చార్జీని మేమందరం షేర్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయ’న్నారు. ఇదిలాఉండగా ఈ ప్రక్రియను తాము కూడా స్వాగతిస్తామని ముంబై ట్యాక్సీమెన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్ క్వాడ్రోస్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top