విభజన హామీలు అమలు చేయండి

విభజన హామీలు అమలు చేయండి - Sakshi


కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు వినతి

కేంద్ర మంత్రులతో భేటీ..

తుపాను ప్రాంతాలకు సహాయానికి నిధులు విడుదల చేయాలి..

విభజన ఇబ్బందుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి


 

 సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ త్వరగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. హుదుహుద్ తుపాను బాధితులకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. ఒక్క రోజు పర్యటన కోసం శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబునాయుడు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. నార్త్‌బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తర్వాత రైల్వే మంత్రిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై వినతిపత్రం ఇచ్చా రు.

 

 అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన పన్ను ప్రోత్సాహకాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై 30 నిమిషాలకు పైగా చర్చించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీతో సమావేశమయ్యారు. కాగా.. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి కొంత సమ యం తీసుకుంటుందని, అందుకని మొదట ఆంధ్రప్రదేశ్‌లోని నదులను అనుసంధానం చేస్తే ఉపయో గం ఉంటుందని, దీనికి సహకరించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంతో వచ్చిన ఇబ్బందుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖను కోరినట్లు తెలిపారు.

 

 

 ఎన్టీఆర్‌ను తెలుగువారు ఆరాధిస్తున్నారు



 శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని చంద్రబాబు సమర్థించారు. ‘‘డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుకు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్చారు. అది నీతిమాలిన చర్య. అందుకే ఈ రోజు కేంద్ర ప్ర భుత్వం దాన్ని పునరుద్ధరించింది. మళ్లీ ఎన్టీ రామారావు గారి పేరు పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలోనూ చెప్పాం. అది చేశాం. కేంద్రంలో మా మంత్రి ఉన్నప్పుడు కూడా చేయకపోతే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో కూడా గమనించాలి’’ అని అన్నారు.

 

  తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రావాళ్ల పేర్లు ఎలా పెడతారని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని టీఆర్‌ఎస్ అంటోందని విలేకరులు అనగా.. ‘‘ఎవరు చేశారు ఈ డెవలప్‌మెంట్? నేను చేశాను. ఎన్టీఆర్ చేశారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు పేరు మార్చినప్పుడు ఎందుకు అడగలేదు? ఎన్టీ రామారావు అంటే తెలుగు జాతి గౌరవించే వ్యక్తి. అది తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా.. ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ఆరాధిస్తున్నారు. పీవీ నర్సింహారావుగారి ఘాట్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని మేం కోరాం. ఒక ప్రాంతమని కాదు. తెలుగు జాతికి న్యాయం జరగాలి’’ అన్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top