మళ్లీ సురవరానికే ఛాన్స్

సురవరం సుధాకర్‌ రెడ్డి


(పుదుచ్చేరి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)



వచ్చే మూడేళ్ల కాలానికి జాతీయ స్థాయిలో సీపీఐకి నాయకత్వం వహించే నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరుగుతుంది. 125 మందితో జాతీయ సమితీని, ప్రధాన కార్యదర్శితో పాటు 9 మందితో కూడిన కార్యదర్శివర్గాన్ని మహాసభ ఎన్నుకుంటుంది. ఈసారి కొత్తగా ఉప ప్రధాన కార్యదర్శి పదవిని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం సుధాకర్‌రెడ్డే ఎన్నికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డి.రాజా పేరు వినబడినప్పటికీ ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. దీంతో ఆయన్ను ఉప ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేసి సుధాకర్‌రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కొ నసాగించనున్నట్టు తెలిసింది. పార్టీ సీనియర్ నేత గురుదాస్‌గుప్తా ఏ పదవిని స్వీకరించబోనని స్పష్టం చేయడం గమనార్హం. 125 మందితో కూడిన జాతీయ సమితిలోకి మహిళలు, యువకుల సంఖ్యను పెంచేందుకు పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.



 ఏళ్ల తరబడి నాయకత్వ స్థానాల్లో తిష్ట వేయడానికి వీల్లేకుండా సీపీఐ జాతీయ మహాసభ నిర్ణయం చేసింది. నాలుగు రోజులుగా ఇక్కడ జరుగుతున్న పార్టీ 22వ మహాసభ శనివారం ఈమేరకు పార్టీ నిబంధనావళిని సవరించింది. 1964లో పార్టీ చీలిన తర్వాత ఇప్పటి వరకు అంటే గత 50 ఏళ్ల కాలంలో నలుగురు మాత్రమే- చండ్ర రాజేశ్వరరావు, ఇంద్రజిత్ గుప్తా, ఏబీ బర్దన్, సురవరం సుధాకర్‌రెడ్డి- పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని నిర్వహించారు. జాతీయ మహాసభ మూడు కీలక పోస్టులు- ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి పదవీ కాలానికి కోత పెట్టింది. ఏ పదవిలోనైనా ఐదు సార్లు ఉండే ప్రస్తుత నిబంధనను గరిష్టంగా మూడు సార్లకు కుదించింది. మూడోసారి ఎన్నిక కావాలంటే జాతీయ సమితీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదించాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top