రూ.2000, రూ.4000లతో ఏం చేయాలి?

రూ.2000, రూ.4000లతో ఏం చేయాలి?


చండీగఢ్‌: ఏటీఎంలలో డ్రా చేసుకునే రూ.2000, రూ.4000లతో ఏం చేయలేకపోతున్నామని, వెంటనే నగదు ఉపసంహరణపై పరిమితి ఎత్తి వేయాలని పలు చోట్ల డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం డబ్బు డ్రా చేసుకునే సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేనందున డ్రా పరిమితి తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా చండీగఢ్‌ నుంచి బహిరంగంగా ఈ డిమాండ్‌ వినిపిస్తోంది.



పెద్ద నోట్ల రద్దు ప్రభావం కారణంగా తలెత్తిన డబ్బు సమస్య చండీగఢ్‌లో పూర్తి స్థాయిలో సర్దుమణిగింది. అక్కడ నోట్ల రద్దుకు ముందు ఉన్న పరిస్థితి మాదిరిగానే తాజా పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఆ ప్రాంత వాసులే చెబుతున్నారు. తమ వద్ద నోట్ల సమస్య తీరినందున ఏటీఎంలో ఉపసంహరణ చేసుకునే నగదు పరిమితి ఎత్తివేయాలని వారు కోరుతున్నారు. నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ దేశంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.



దాదాపు 86శాతం నోట్లను తిరిగి మార్పిడి చేశారు. అయితే, ఈ నిర్ణయం అమలులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అయినందున భరించారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద తీవ్ర అగచాట్లు పడ్డారు. అయితే ప్రస్తుతం అన్ని ఏటీఎంలలో డబ్బు లభిస్తుండటం, పెద్దగా క్యూలు లేకపోవడంతో ఇక సాధారణ పరిస్థితులు ఏర్పడినందున ఉపసంహరణ నగదు పరిమితి ఎత్తివేస్తే బాగుంటుందని దేశ వ్యాప్తంగా పలు చోట్ల డిమాండ్‌ లు వస్తున్నాయి. ‘అదృష్టం కొద్ది పరిస్థితులు మారాయి. ప్రస్తుతం డబ్బు విత్‌ డ్రా చేసుకునే విషయంలో సమస్య రావడం లేదు.



అయితే, విత్‌ డ్రా చేసుకునే నగదు తక్కువే అయినందున వాటితో ఏ సమస్యలు తీరడం లేదు. అం‍దుకే పరిమితి ఎత్తివేయాలి. రూ.2000, రూ.4000తో ఏం చేయగలం’ అంటూ  దేవ్‌ అనే వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇక హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న రాధిక అనే విద్యార్థిని స్పందిస్తూ ‘గతంలో మా అమ్మ వాళ్లు పంపించిన డబ్బులు సైతం విత్‌డ్రా చేసుకునేందుకు ఎంతో ఇబ్బంది అయ్యేది. కానీ,గత వారం నుంచి ఆ సమస్య లేదు. కాస్తంత ఒత్తిడి తగ్గింది. ఏ ఏటీఎం వద్దకు వెళ్లినా డబ్బు డ్రా చేసుకోగలుగుతున్నాం’ అని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top