ఇది డర్టీవార్‌.. కొత్త మార్గాల్లో పోరాడాలి

ఇది డర్టీవార్‌.. కొత్త మార్గాల్లో పోరాడాలి


కశ్మీర్‌పై ఆర్మీ చీఫ్‌ రావత్‌

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం ‘డర్టీవార్‌’ను ఎదుర్కొంటోందని, ఈ యుద్ధంలో వినూత్న పోరాట మార్గాలను అనుసరించాలని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యానించారు. రాళ్ల దాడిని ఎదుర్కోవడానికి మానవ కవచంగా ఓ కశ్మీరీ పౌరుడిని జీప్‌కు కట్టేసిన ఆర్మీ అధికారి మేజర్‌ లీతుల్‌ గొగోయ్‌ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. మిలిటెంట్ల ప్రభావిత కశ్మీర్‌లో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న యువ అధికారులకు నైతిక స్థైర్యం పెంచడానికే గొగోయ్‌కి అవార్డు ఇచ్చామన్నారు. ‘ఇది ప్రచ్ఛన్న యుద్ధం. ప్రత్యర్థులు నీచ మార్గాల్లో యుద్ధం చేస్తున్నారు.. అందుకే వినూత్న విధానాల్లో పోరాడాలి’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


‘జనం మాపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు విసురుతున్నారు. మేమేం చేయాలని మా జవాన్లు అడిగితే వేచి చూసి, చచ్చిపోండని చెప్పాలా? జాతీయ పతాకం కప్పిన శవపేటికను తీసుకొచ్చి అందులో మీ శవాలను గౌరవంగా ఇంటికి పంపుతామని చెప్పాలా? ఆర్మీ చీఫ్‌గా నేనలా చెప్పలేను.. మా జవాన్లలో నైతిక బలాన్ని నేను కొనసాగించాల’ని రావత్‌ అన్నారు.  కశ్మీర్‌ ఆందోళనకారులు రాళ్లు రువ్వకుండా తుపాకులతో కాల్పులు జరిపితే ఎదుర్కోవడానికి సులభంగా ఉండేదన్నారు.


‘మీరు మాపై రాళ్లు రువ్వకుండా కాల్పులు జరపండి.. తర్వాత ఏం చేయాలో అది చేస్తా’ అని వారిని ఉద్దేశించి అన్నారు. ఏ దేశంలోనైనా ప్రజలకు ఆర్మీపై భయం లేకపోతే ఆ దేశం నాశనమవుతుందని వ్యాఖ్యానించారు. తమది స్నేహపూర్వక సైన్యమని, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తమను పిలిచినప్పుడు ప్రజలు భయపడాల్సి ఉంటుందని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top