ఆ బ్యాంక్లో అందరూ బెగ్గర్సే..

ఆ బ్యాంక్లో అందరూ బెగ్గర్సే..


బీహార్: ఇప్పటివరకూ మహిళలకు, రైతులకు ప్రత్యేక బ్యాంకుల గురించి విన్నాం. అయితే మేము ఎందులోనూ తక్కువ కాదంటూ బెగ్గర్లు కూడా ఓ బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు. బీహార్ రాష్ట్రం గయాలో ఇప్పుడు ఆ బ్యాంక్ ...బెగ్గర్లను ఆకట్టుకుంటోంది.  భిక్షాటన చేసి పొట్టపోసుకునే 40 మంది భిక్షగాళ్లు  'మంగళ' పేరుతో ఓ  బ్యాంక్ను ఏర్పాటు చేసుకున్నారు.  పవిత్ర పుణ్యక్షేత్రమైన గయాలోని మంగళగౌరి అమ్మవారి గుడిలోని భిక్షకుల ఆలోచనకు ప్రతిరూపమే ఈ మంగళ బ్యాంక్.



అపుడెపుడో..అడుక్కుని ఆస్తులు కూడబెట్టిన భిక్షగాళ్ల ఆస్తుల వివరాలు విని విస్తుపోయాం... బెగ్గర్ల లైఫ్ స్టైల్ తెలుసుకుని అవాక్కయ్యాం....ఇపుడు బెగ్గర్లు తమకోసం తాము  ఏర్పాటు   చేసుకున్న బ్యాంక్ గురించి వింటే వార్నీ అనక మానరు. ఎందుకంటే డబ్బులు ఎక్కువై వీళ్లు ఈ బ్యాంక్ను ఏర్పాటు చేసుకోలేదు.



కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటివి కూడా  వీరికి అందుబాటులో లేవు.  దాంతో తమ  భవిష్యత్ అవసరాల కోసం, ఆపదలో ఉన్నపుడు,  ఆర్థికంగా కష్టాల్లో ఉన్నపుడు తమను ఆదుకోవడం కోసం చేసుకున్న ఒక చిన్న వెసులుబాటు ఈ మంగళబ్యాంక్. కాగా ఇక్కడ  మేనేజర్ సహా  సిబ్బంది  అంతా బెగ్గర్లే. అంటే బెగ్గర్ల బ్యాంక్ అన్నమాట. రిథమిక్గా వినడానికి ఎంత బావుందో.... ఈ ప్రయత్నం వెనుక వారి కృషి పట్టుదల కూడా అంతే  హర్షణీయంగా ఉంది.



ఈ మంగళబ్యాంక్  మేనేజర్ రాజ్ కుమార్ మాంఝీ మాటల్లో చెప్పాలంటే.. 40మంది సభ్యులు, ఒక  మేనేజర్, ట్రెజరర్, సెక్రటరీ, ఓ  ఏజెంట్ ఉన్న ఈబ్యాంక్లో  ప్రతీ కార్యక్రమాన్ని కలిసికట్టుగా చేసుకుంటారు. అచ్చంగా అన్ని బ్యాంకుల్లాగానే వీరికి  నియమ నిబంధనలు ఉంటాయి.



ప్రతీ మంగళవారం తలా రూ.20 చొప్పున మొత్తం రూ.800 జమ చేసుకుంటారు. అలా కూడబెట్టిన సొమ్మును తమ అవసరాల కోసం  వాడుకుంటారు.  అంతేకాకుండా తమకూ లోన్ సదుపాయం ఉందని బ్యాంక్ సెక్రటరీ మాలతీదేవి  చెబుతోంది.  ప్రమాదంలో గాయపడిన ఒక బెగ్గర్ కుటుంబానికి ఎనిమిది వేల  రూపాయల సాయాన్ని కూడా అందించినట్లు తెలిపింది.



తమ భవిష్యత్ అవసరాల కోసం  మంగళ బ్యాంక్ బాగా ఉపయోగపడుతోందని సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర నిరుపేదలు, సాంఘిక సంక్షేమ సంస్థ సహకారంతో గత సంవత్సర కాలంగా ఈ బ్యాంక్ను విజయవంతంగా నడిపిస్తున్నారు.  అన్నట్టు  ఈ బ్యాంక్  సిబ్బంది  అంతా బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ కోసం బాగా చదువుకోవడం మరో విశేషం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top