ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు

ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు - Sakshi


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ  చాలా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంటోంది.  ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే... కేవలం రెండు చోట్ల మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మిగిలిన 9 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ దూసుకుపోతోంది.  ఈ పదకొండు స్థానాలు బీజేపీవే.



ఉత్తరప్రదేశ్‌లో పెచ్చరిల్లిన అత్యాచారాలు, మతఘర్షణలు ఉపఎన్నికలపై ప్రభావం చూపలేకపోయాయి.  ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ ఈ ఎన్నికల్ని చాల సీరియస్‌గా తీసుకున్నారు.   మతఘర్షణలతో ఓట్లు చీలి ఉత్తరప్రదేశ్‌లో లాభపడతామని ఆశించిన బీజేపీకి ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించేవే.


 


అటు మోడీ ఖిల్లా గుజరాత్‌లోనూ రాజకీయాలు మారిపోయాయి.  బీజేపీకి చెందిన సిట్టింగ్‌ స్థానాలు రెండింటిలో కాంగ్రెస్‌ పాగా వేసింది.  గుజరాత్‌లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా కేవలం ఆరు స్థానాల్లోనే బీజేపీ విజయం దిశగా ముందుకు సాగుతోంది.  గడిచిన 12 ఏళ్లలో గుజరాత్‌లో  మోడీ లేకుండా జరిగిన తొలిఎన్నికలివి.  



ఇక గుజరాత్‌లో మితిమీరిన ఆత్మవిశ్వాసం బీజేపీని ఇబ్బందుల్లో నెట్టినట్టు కనిపిస్తోంది.  ఉపఎన్నికల్లో సీనియర్‌ నేతలెవరూ ప్రచారం చేయలేదు.  మోడీ ఎమ్మెల్యేగా ఉన్న మణినగర్‌ నియోజకవర్గంలో కేవలం 33 శాతం పోలింగ్ నమోదవటం గుజరాత్‌ ఓటర్ల నిరాకస్తతను తెలిపింది. వడోదరాలో భారీ మెజార్టీతో రంజన్‌ బెన్‌ గెలవడం బీజేపీకి ఊరటే. ఇక రాజస్థాన్‌లోనూ కమలం వాడిపోయింది. 


నాలుగు సిట్టింగ్‌ స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్‌కు అప్పగించింది. ఒక్క చోట మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది.  అటు శారదా చిట్స్‌ స్కామ్‌ మమతా బెనర్జీ సర్కారుపై ప్రభావం చూపుతుందన్న అంచనాలు తప్పాయి.  బెంగాల్‌లో ఉపఎన్నికలు జరిగిన రెండు చోట్ల ఓ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌, మరో స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top