ఎయిమ్స్లో బాలిక కిడ్నీలు మాయం

ఎయిమ్స్లో బాలిక కిడ్నీలు మాయం - Sakshi


దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థగా పేరొందిన ఎయిమ్స్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ సర్జన్ ఒకరు.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరేళ్ల బాలిక రెండు కిడ్నీలను మాయం చేశాడు. పైగా ఆపరేషన్ సమయంలో ఆ బాలికకు ఒకటే కిడ్నీ ఉందని దబాయించాడు. అయితే ఆసుపత్రి రికార్డులు మాత్రం ఆ అమ్మాయికి రెండు కిడ్నీలు ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.



వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్బరేలీకి చెందిన పవాన్.. తోపుడు బండిమీద జ్యూస్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని ఆరేళ్ల కూతురు దీపిక కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సూచనమేరకు చికిత్స నిమిత్తం గత డిసెంబర్లో ఢిల్లీలోని ఎయిమ్స్ వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం దీపిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీని తొలిగిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 17న ఆపరేషన్ నిర్వహించారు.



ఆ తరువాత జరిపిన పరీక్షల్లో దీపిక రెండు కిడ్నీలు కనబడకపోవడంతో ఇటు తల్లిదండ్రులు సహా ఆసుపత్రి సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలేం జరిగిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడ్ని అడిగితే.. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే ఒక్క కిడ్నీ. దానినే నేను తీసేశా. రెండు కిడ్నీలు లేనేలేవు' అంటూ నర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన మరికొందరు వైద్యులు విషయం బయటికి చెప్పొద్దని, వీలైనంత త్వరలో దీపికకు మరో కిడ్నీ అమర్చుతామని ఆమె తండ్రి పవాన్ కు నచ్చజెప్పారు.



ప్రస్తుతం ఆ అమ్మాయి డయాలసిస్ ఆధారంగా బతుకుతోంది. 'ఎలాగోలా కిడ్నీ పెడతామని, అప్పటిదాకా మాట్లాడొద్దని డాక్టర్లు చెప్పారు. నా కూతురికి ఏదైనా జరిగితే మాత్రం వాళ్లని వదలను. కోర్టుకు ఈడ్చుతా' అని దీపిక తండ్రి పవాన్ అంటున్నాడు. కాగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, దానిపై ఎంక్వైరీ చేయిస్తానని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం.సీ. మిశ్రా పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top