హెలిపోర్టు వద్దే వద్దు..


సాక్షి, ముంబై: మహాలక్ష్మి రేస్ కోర్స్ మైదానంలో సంపన్నశ్రేణి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న హెలిపోర్టును మహానగర పాలక సంస్థ (బీఎంసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగానికి పంపించింది.  ఈ హెలిపోర్టు నిర్మాణాన్ని బీఎంసీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేసింది. ఈ ఖాళీ మైదానంలో హెలిపోర్టు నిర్మించడంవల్ల ముంబైకర్లకు వినోద కార్యకలాపాలకు స్థలం ఉండదని, హెలిపోర్టు అందుబాటులోకి వస్తే భద్రతా కారణాల దృష్ట్యా సామాన్య ప్రజలను ఈ మైదానం ఛాయలకు కూడా రానివ్వబోరని ఆక్షేపించింది.



మహాలక్ష్మి రేస్ కోర్సు మైదానాన్ని వంద సంవత్సరాల కిందట టర్ఫ్ క్లబ్‌కు ఇచ్చారు. ఈ లీజు గత ఏడాది మేలో పూర్తయింది. ఈ ఖాళీ స్థలంలో థీమ్‌పార్కు నిర్మించాలని శివసేన ప్రతిపాదించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రూపొందించారు. దీనినిముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు కూడా అందజేశారు. తదనంతరం ఈ ప్రతిపాదనను మేయర్ సునీల్ ప్రభు బీఎంసీకి సమర్పించారు. దీన్ని బీఎంసీ 2013 జూన్ ఆరో తేదీన ప్రభుత్వానికి పంపించింది. ఈ ప్రతిపాదన వేగం పుంజుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ థీమ్‌పార్కుకు బదులుగా హెలిపోర్టు నిర్మించాలనే ప్రతిపాదనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ‘ఈ మైదానంలో హెలిపోర్టు నిర్మించడం వల్ల వీవీఐపీల రాకపోకలు పెరుగుతాయి.



 దీంతో ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువవుతాయి. అంతేకాకుండా ఇక్కడికి తరుచూ వీఐపీలు రావడంవల్ల భద్రత కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. దీంతో థీంపార్కుకు వెళ్లాలంటే సామాన్య ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని బీఎంసీ తన నివేదికలో స్పష్టం చేసింది. రేస్‌కోర్సులో మొత్తం 225 ఎకరాలు అంటే 8,55,198 చదరపు మీటర్ల స్థలం ఉంది. ఇందులో బీఎంసీ అధీనంలో 2,58,245 చదరపు మీటర్ల స్థలం ఉండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది. బీఎంసీ తన అధీనంలోని భూమిని రాయల్ వెస్టర్న్ ఇండియా టర్ఫ్ క్లబ్ లిమిటెడ్‌కు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. అది 2013 మే 31న పూర్తికావడంతో థీం పార్కు నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఒకేసారి రెండు లేదా మూడు హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే విధంగా భారీ హెలిపోర్టు నిర్మించాలని సంకల్పించింది. అందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో  రూ.11 కోట్లు నిధులు మంజూరు కూడా మంజూరు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top