'తెల్ల చర్మం వల్లే అధ్యక్షురాలయ్యారు'

భోపాల్ లో కేంద్ర మంత్రి గిరిరాజ్ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు - Sakshi


కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనే చిత్తం వచ్చినట్లు మాట్లాడారు. ‘సోనియా తెలుపు రంగులో లేనట్లయితే, రాజీవ్ గాంధీ ఓ నైజీరియా మహిళను పెళ్లాడి ఉన్నట్లయితే, ఆమె తెలుపు రంగు మహిళ కానట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించేదా?’ అని గిరిరాజ్ సింగ్ మంగళవారం బిహార్‌లోని హాజీపూర్‌లో విలేకర్లతో అన్నారు.



గిరిరాజ్ మాటలపై కాంగ్రెస్ సహా జాతీయ స్థాయిలో మహిళా నేతలు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. కేంద్ర కేబినెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రిగా ఉన్న గిరిరాజ్‌ను ప్రధాని నరేంద్రమోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గిరిరాజ్ వ్యాఖ్యలు ఆయన జాత్యహంకార ధోరణిని, మహిళల పట్ల ఆయనకున్న వైఖరిని వ్యక్తం చేస్తున్నాయని పలువురు మహిళానేతలు ఆరోపించారు. హాజీపూర్‌లో సోనియాపై విమర్శలు గుప్పించడమే కాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకపోవటంపైనా గిరిరాజ్ అతిగా స్పందించారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే రాహుల్ ప్రధాని అయ్యేవారు. ఏదో కారణంతో ప్రధాని 47 రోజుల పాటు అదృశ్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి అదృశ్యం కూడా మలేసియా విమానం మాయం కావటం లాంటిదే’ అని అన్నారు.



గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలచేయడం ఇది తొలిసారి కాదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీని వ్యతిరేకించే వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని అన్నారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన గిరిరాజ్‌ను తాజా వివాదంపై స్పందించమని కోరగా తొలుత నిరాకరించారు. వివాదం ముదిరిపోవటంతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్‌లను బాధపెట్టినట్లయితే అందుకు విచారిస్తున్నానన్నారు. తాను ‘ఆఫ్‌ది రికార్డ్’గా మాట్లాడిన మాటల్ని మీడియా రాద్ధాంతం చేసిందన్నారు. కాగా సోనియాపై గిరిరాజ్  వ్యాఖ్యలను ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా  ఖండించారు. దేశంలో గౌరవప్రద హోదాలో ఉన్న మహిళ గురించి కేంద్రమంత్రి మాట్లాడే పద్ధతి ఇదేనా ఫేస్‌బుక్ లో విమర్శించారు.   గిరిరాజ్‌ను బీజేపీ చీఫ్ అమిత్‌షా ఫోన్‌లో మందలించారు. మరోవైపు పట్నాలో గిరిరాజ్ ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. టొమాటోలు, కోడిగుడ్లను ఇంటిపైకి విసిరారు.

 

 నైజీరియా ఆగ్రహం..

తమ దేశపు మహిళలను కించపరిచే విధంగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించటంపై భారత్‌లోని నైజీరియా దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. తమ దేశానికి మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top