బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!!

బీజేపీ హీరో.. ఎంఎన్ఎస్ జీరో!! - Sakshi


ముంబై మహానగరంలో ఒకప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ సమితి అంటే.. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉండేది. రాజ్ ఠాక్రే స్థాపించిన ఈ పార్టీ.. ముంబై నగరం మరాఠీలకే సొంతం కావాలన్న నినాదంతో ప్రజల్లో వీరాభిమానాన్ని సంపాదించుకున్న ఎంఎన్ఎస్.. తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో.. ముంఖ్యంగా ముంబై మహానగరంలో పూర్తిగా చతికిలబడిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో అత్యధికంగా 15 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 14 సీట్లతో శివసేన రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ మాత్రం ఈ రెండింటికీ చాలా దూరంగా 5 సీట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. చివరకు హైదరాబాదీ పార్టీగా పేరొందిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) కూడా అక్కడ బోణీ కొట్టింది గానీ, ఎంఎన్ఎస్ మాత్రం ఒక్క స్థానం కూడా సంపాదించలేకపోయింది. ఎంఎన్ఎస్ ఒక్కసారిగా ఇలా చతికిలబడుతుందని వాస్తవానికి ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ముంబై రాజకీయ చిత్రపటం నుంచి అది పూర్తిగా మాయమైపోయింది.



ఒకప్పుడు సేవ్రి, మాహిమ్, మగాథానె లాంటి ప్రాంతాలన్నీ ఎంఎన్ఎస్ కంచుకోటలు. కానీ, వాటిలో ఎక్కడా గెలవలేదు. అలాగే బాలా నందగావ్కర్, నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దారేకర్ లాంటి మహాయోధులు కూడా మట్టికరిచారు. పైగా కేవలం ఓడిపోవడమే కాదు.. వాళ్ల మెజారిటీలలో తేడాలు కూడా చాలా ఎక్కువ. ఉదాహరణకు నందగావ్కర్ అయితే తన ప్రత్యర్థి, శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లలో సగం కూడా సంపాదించలేకపోయారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మాండమైన నాయకుడు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులలో ఆయన పరిస్థితి దారుణంగా మారింది. అలాగే ప్రవీణ్ దారేకర్ అయితే ఏకంగా మూడోస్థానానికి పడిపోయారు. ఒక్క మాహిమ్ నియోజకవర్గంలో మాత్రం అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే సర్దేశాయ్ కాస్త గట్టి పోరాటం చేశారు. ఆయన కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఇక్కడి ఓటమి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రేకు చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే.. మాహిమ్ స్థానం ఆ పార్టీకి చాలా ముఖ్యం. శివాజీ పార్కు లాంటి కీలక ప్రాంతాలన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. బాలఠాక్రే కూడా ఇక్కడినుంచే తన ఉత్తేజపూరితమైన ప్రసంగాలు ఇచ్చేవారు. ఆయన మాటలు వింటేనే మరాఠీల రోమాలు నిక్కబొడుచుకునేవి. అలాంటి స్థానాన్ని కూడా పోగొట్టుకున్న ఎంఎన్ఎస్.. ఇక రాబోయే ఎన్నికల నాటికి ఏమవుతుందోనని అంతా చూస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top