ఢిల్లీలో బీజేపీ విజయఢంకా

ఢిల్లీలో బీజేపీ విజయఢంకా - Sakshi


► వరుసగా మూడోసారి ఎంసీడీ కైవసం

► 70 వార్డులకుగాను 181 చోట్ల గెలుపు

► 48 వార్డులతో రెండో స్థానంలో ఆప్, 30 చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

► ఈవీఎంల ట్యాంపరింగ్‌తో ఓడిపోయామన్న ఆప్‌




న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయ దుందుభి మోగించింది. హస్తినలోని మూడు కార్పొరేషన్లపై పట్టు నిలబెట్టుకుని, ఆప్, కాంగ్రెస్‌లను చావుదెబ్బ తీసింది. మొత్తం 272 వార్డులకు గాను 270 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా కాషాయ దళం 181 చోట్ల విజయ కేతనం ఎగరేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) 48 వార్డుల్లో గెలిచి రెండో స్థానంలో, 30 వార్డులతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి. బీజేపీకి దక్షిణ ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌డీఎంసీ)లో 70, ఉత్తర ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ)లో 64, తూర్పు ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఈడీఎంసీ)లో 47 వార్డులు దక్కాయి. ఆప్‌ ఎస్‌డీఎంసీలో 16, ఎన్‌డీఎంసీలో 21, ఈడీఎంసీలో 11 చోట్ల గెలవగా, కాంగ్రెస్‌ ఈ మూడు చోట్లా వరుసగా 12, 15, 3 వార్డులతో గెలిచింది.


ఇతరులు 11 వార్డుల్లో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. అభ్యర్థుల మృతితో రెండు వార్డుల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి. 2012 నాటి మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 138 వార్డులను కైవసం చేసుకుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచి అఖండ విజయం సాధించిన ఆప్‌ ఈ ఎన్నికల్లో చతికిలబడింది. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడే స్థానాల్లో గెలిచిన బీజేపీ తాజా పోరులో తన పదేళ్ల మునిసిపల్‌ పాలనపై వ్యతిరేకతను సులభంగా అధిగమించింది. ఎన్నికల్లో 71 లక్షల మందికిపైగా ఓటేయగా, అభ్యర్థులందర్నీ తిరస్కరించే ‘నోటా’ బటన్‌కు 0.69 శాతం(49,235) ఓట్లు పడ్డాయి.


దక్షిణ ఢిల్లీలోని ఓ వార్డులో ఆప్‌ అభ్యర్థి తన బీజేపీ ప్రత్యర్థి చేతిలో కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోగా, దక్షిణ ఢిల్లీలోని ఓ వార్డులో బీజేపీకి చెందిన అభ్యర్థి అత్యధికంగా 9,866 ఓట్ల మెజారిటీతో ఆప్‌ అభ్యర్థిని ఓడించారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీచేసిన ఆప్‌ మాజీ నేత యోగేంద్ర యాదవ్‌ సారథ్యంలోని స్వరాజ్‌ ఇండియా పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడంతో ఓడిపోయామని ఆప్‌ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోపించారు.


రిగ్గింగ్‌ జరగకుండా బీజేపీకి అంత భారీ విజయం సాధ్యం కాదన్నారు. అయితే సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ మాత్రం ఆరోపణలు చేయకుండా.. బీజేపీని అభినందించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లతో కలసి పనిచేస్తామని ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ అజయ్‌ మాకెన్‌ ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాజీనామా చేశారు.



సుక్మా జవాన్లకు అంకితం

ఎన్నికల్లో తమ విజయాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అంకితమిస్తున్నామని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారి చెప్పారు. గెలుపు సంబరాలకు దూరంగా ఉంటామన్నారు.



ఆప్‌లో ఆత్మవిమర్శ అవసరం

ఇటీవల పలు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్న ఆప్‌లో అంతర్మథనం మొదలైంది. ఆప్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ ఢిల్లీ కన్వీనర్‌ దిలీప్‌ పాండే పదవి నుంచి తప్పుకున్నారు. రాజీనామాకు తానూ సిద్ధమని చాందినీ చౌక్‌ ఆప్‌ ఎమ్మెల్యే ఆల్కా లాంబా చెప్పగా, పార్టీలో అత్మ విమర్శ అవసరమని ఢిల్లీ మంత్రి కపిల్‌ శర్మ పేర్కొన్నారు. మోదీ కృతజ్ఞతలు: బీజేపీపై విశ్వాసముంచి ఎన్నికల్లో గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. శ్రమించి ఘన విజయం సాధించిన బీజేపీ టీమ్‌ను అభినందిస్తున్నానన్నారు.



ప్రతికూల రాజకీయాలను తిరస్కరించారు: అమిత్‌

ఢిల్లీ ప్రజలు ప్రతికూల రాజకీయాలను తిరస్కరించి, ‘అందరితో కలసి, అందరి అభివృద్ధి’ కోసం అన్న మోదీ నినాదానికి ఆమోదం తెలిపారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. ‘బీజేపీకి ఇది అపూర్వ విజయం. ఇది మోదీ నాయకత్వం విజయం’ అని అన్నారు.



ఆ ఈవీఎంలే మిమ్మల్నీ గెలిపించాయి: వెంకయ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఈవీఎంలపై ఆప్‌ ఆరోపణలు సిగ్గుచేటని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు విజయాన్ని కట్టబెట్టింది ఆ ఈవీఎంలేనని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలన్న ఆప్‌ అధికార దాహంతో ఢిల్లీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు.



విపక్షాలు ఏకం కావాలి: కాంగ్రెస్‌

విపక్షాలు ఏకం కావాలని, కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకత పనిచేయదని ప్రాంతీయ పార్టీలు తెలుసుకోవాలని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా పిలుపునిచ్చా రు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో స్పందిం చిన ఆయన.. సైద్ధాంతిక పోరాటంలో పార్టీలు మొదల దేశ ప్రయోజనాలకు ప్రాధన్యమివ్వాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల శాతం 9.7 నుంచి 21కి పెరిగినందుకు కార్యకర్తలను అభినందిస్తున్నాఅని అన్నారు.



కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతం

2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 9.7% ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ తాజా మునిసిపల్‌ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా ఓట్ల శాతంలో మాత్రం మెగురుపడి 21.28 శాతం(11 శాతం ఎక్కువ) ఓట్లు గెల్చుకుంది. బీజేపీ ఓట్ల శాతం 32.2 నుంచి 5 శాతం పెరిగి దాదాపు 37 శాతానికి చేరుకోగా ఆప్‌ ఓట్ల శాతం 54.3 నుంచి సగం తగ్గి 26 శాతానికి పతనమైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top