కొన‘సాగుతున్న’ ఉత్కంఠ..


పొత్తు విషయంలో బీజేపీ మల్లగుల్లాలు

* శివసేతో పొత్తుకు కొందరు నాయకుల విముఖత

* ఒంటరిగానే ముందుకు పోవాలని సూచన

* రెండు రోజుల్లో తేలనున్న సర్కారు భవితవ్యం..


ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: బీజేపీ ఎవరితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకరోజు ఎన్సీపీతో చేతులు కలుపుతుందని, మరో రోజు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీంతో రాష్ట్రంతో పాటు దేశ ప్రజల దృష్టి మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్రీకృతమైంది. ప్రస్తుతం అందుకున్న వివరాల మేరకు బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇది వీలుకానట్లయితే శివసేనతో కలిసి ఏర్పాటుచేయాలన్న యోచనలో ఉంది.

 

సోమవారం తేలనున్న భవితవ్యం....


బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై చర్చలు జరపడానికి రాజ్‌నాథ్ సింగ్, జె.పి. నడ్డాలు ముంబైకి రానున్నారు. శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. శివసేనతో చర్చలు జరుపుతారు. ఏయే శాఖలు కేటాయించాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. చర్చలు సఫలమైతే బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

 

ఒంటరిగానే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు...

రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 123 స్థానాలు దక్కించుకున్న బీజేపీ తక్కువ సంఖ్యా బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేసే విషయంపై బీజేపీ ఆసక్తి చూపడం లేదని, సేనతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు శివసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని చర్చలు జోరుగా సాగగా... మరోవైపు  బీజేపీ మాత్రం శివసేనతో కాకుండా తక్కువ సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోందని, శివసేన మంత్రుల మినహా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోందని, మరోవైపు శివసేనతో నామమాత్రంగా చర్చలు సాగిస్తున్నట్లు  రాజకీయ వర్గాలు తెలిపాయి.



తక్కువ సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటైనా శివసేన, కాంగ్రెస్, లేదా ఎన్సీపీ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టలేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎన్సీపీ పరోక్షంగా మద్దతు తెలపవచ్చని బీజేపీకి చెందిన కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్లయితే దేశంలో బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని బీజేపీకి చెందిన ఢిల్లీ నాయకులు, రాష్ట్రంలోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  అంతేకాకుండా ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్లయితే ఆ పార్టీలో కుంభకోణంలో ఇరుక్కున్న నాయకులకు కొమ్ము కాస్తుందనే అపవాదు వస్తుందని బీజేపీ నాయకులు అంటున్నారు.



అందుకే ఎన్సీపీ మద్దతు ఇచ్చినా తీసుకోకూడదని అభిప్రాయపడుతున్నారు. మద్దతు తీసుకున్నా, అలాగే ప్రతిపక్షం, చిన్న పార్టీల మద్దతు తీసుకున్నాగానీ ప్రభుత్వం తక్కువ సంఖ్యాబలంతోనే ఉంటుంది. కాబట్టి తక్కువ సంఖ్యాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేదా శివేసనతో కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలా అనే విషయంపై చాలా మంది బీజేపీ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు.  ఇటువంటి పరిస్థితుల్లో శివసేన మద్దతు తీసుకున్నట్లయితే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని, అలాగే ఐదేళ్ల వరకు ఎటువంటి ఢోకా ఉండదని బీజేపీకి చెందిన వినోద్ తావ్డే, పంకజా ముండే తదితర నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.



అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివసేన-బీజేపీ కూటమి తెగిపోయిన తర్వాత ఏవైతే ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయో వాటిపై దృష్టి పెట్టకుండా భవిష్యత్తు గురించి ఆలోచించాలని, పార్టీని బలోపేతం చేయడం, అలాగే ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి హామీలను పూర్తి చేయాలని, దాని కోసం స్థిరమైన, భారీ సంఖ్యా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని సదరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే శివసేనతో పొత్తు కూడితే ఆ పార్టీ నెత్తిపై కూర్చుంటుందని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్ వంటి నాయకులు వాదిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శివసేనతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో వచ్చే స్థానిక ఎన్నికల్లో వారితో ఇబ్బందులు తప్పవని వారు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

 

ఉద్ధవ్ గైర్హాజరు.....

సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదితో కలిసి ఉద్ధవ్ చర్చించాల్సి ఉంది. కాగా, ఆయన గైర్హాజరుతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మరింత అయోమయం నెలకొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top