యడ్యూరప్ప హోటల్‌లో ఎందుకు తెప్పించారంటే..

యడ్యూరప్ప హోటల్‌లో ఎందుకు తెప్పించారంటే.. - Sakshi


బెంగళూరు: దళితుల ఇంటికి వెళ్లిన బీజేపీ నేత యడ్యూరప్ప అక్కడ భోజనం చేయకుండా హోటల్‌ నుంచి తెప్పించుకుని తిన్నారంటూ వస్తున్న ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ఆ రోజు యడ్యూరప్ప దళితుల ఇంట్లో తిన్నారని, ఆయనతోపాటు ఉన్న కొంతమందికి ఆహారం సరిపోకపోవడంతోనే బయట నుంచి తెప్పించాల్సి వచ్చిందని బీజేపీ నేత సురేశ్‌ కుమార్‌ చెప్పారు. చిత్రదుర్గాలోని ప్రస్తుతం దళిత వాడల్లో పర్యటిస్తున్న యడ్యూరప్ప మధుకుమార్‌ అనే ఓ దళిత వ్యక్తి ఇంటికి వెళ్లిన సందర్భంలో అక్కడ తినకుండా బయటనుంచి తెప్పించుకొని తిని కులవివక్షను చూపారని డీ వెంకటేశ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.



కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తమ ఆయుధంగా మలుచుకొని ఆయనపై విమర్శల దాడి ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సురేశ్‌ కుమార్‌ వివరణ ఇస్తూ ‘యెడ్యూరప్ప, పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఓ దళితుడి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులు వండివడ్డించారు. వారు ఏం వడ్డించారనే విషయం చెప్పలేంగానీ, చాలా అద్భుతమైన భోజనం పెట్టారు. యడ్యూరప్ప కూడా చక్కగా తిన్నారు. అదొక సంతోషకరమైన వేడుక’ అని ఆయన చెప్పారు.



మరోపక్క, మధుకుమార్‌ అనే ఆ వ్యక్తి కూడా తన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నే యడ్యూరప్ప తిన్నారని తెలిపాడు. ఇదిలాఉండగా, 40 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న యడ్యూరప్ప ఇప్పుడెందుకు దళితుల ఇళ్లచుట్టూ తిరుగుతున్నారని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ఇన్ని రోజులు వారు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. దళితుల ఇళ్లకు వెళుతూ వారిని యడ్యూరప్ప అవమానిస్తున్నారని విమర్శించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top