బీజేపీ ‘మిషన్‌ 350 ప్లస్‌’

బీజేపీ ‘మిషన్‌ 350 ప్లస్‌’ - Sakshi


అమిత్‌ షా, మోదీ దిశానిర్దేశం

బీజేపీ పాలిత సీఎంల భేటీ



సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో 350కి పైగా సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీలు దిశానిర్దేశం చేశారు. ‘మిషన్‌ 350 ప్లస్‌’లో భాగంగా ఇంతకవరకూ బీజేపీ గెలవని 120 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు శ్రమించాలని స్పష్టం చేశారు. అమిత్‌ షా అధ్యక్షతన సోమవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మూడున్నర గంటలు భేటీ జరిగింది.


ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, 13 రాష్ట్రాల సీఎంలు, ఆరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు భేటీకి హాజరయ్యారు. రాష్ట్రాల్లో మోదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరుపై అమిత్‌షా ప్రధానంగా ఆరా తీశారు. పేదల అనుకూల పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయా? పథకాల అమలుకు నిధుల కొరత ఉందా? అన్న అంశాలపై సీఎంలతో చర్చించారు. మోదీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై సీఎంలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రచారం చేయాలని, ‘మిషన్‌ 350 ప్లస్‌’ కోసం పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తూ, వారి అండగా ఉండాలని మోదీ, అమిత్‌షాలు సూచించారు.


సిట్టింగ్‌ స్థానాల్ని నిలబెట్టుకొనేందుకు అమలు చేస్తున్న ప్రణాళికల గురించి సీఎంల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాల్లో పార్టీ పట్టు పెంచుకునేందుకు క్రమం తప్పకుండా వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని సీఎంలకు షా సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థుల జాబితా రూపొం దించామని, నియోజకవర్గాల్లో పనితీరు, పార్లమెంట్‌ హాజ రు మేరకు కొందరికి మొండిచేయి తప్పదని  అధినా యకత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. భేటీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎంపీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఇతర బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.



సీట్ల కేటాయింపులో మిత్రపక్షాలకు నిరాశే!

2014లో బీజేపీ 428 సీట్లకు పోటీచేయగా 66 శాతం ఉత్తీర్ణతతో 282 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి లక్ష్యం 350 కావడంతో మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ అంత ఉదారంగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, పంజాబ్‌లో అకాళీదళ్‌ వంటి పార్టీలు కొన్ని స్థానాలతోనే సరిపెట్టుకోకతప్పదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top