ముమ్మాటికి రైతు వ్యతిరేకమే!

ముమ్మాటికి రైతు వ్యతిరేకమే! - Sakshi


న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. దేశానికి వెన్నెముక అయిన రైతును గాలికొదిలేసి.. పారిశ్రామికవేత్తల కొమ్ముగాసేందుకే ఈ చట్టాన్ని తీసుకురావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రైతుల పక్షాన నిలిచిన వారిని జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు. అన్నదాతలకు అనుకూలంగా ఉన్నవారిని అభివృద్ధి నిరోధకులుగా చూపడం తగదన్నారు.



తమ హయాంలో తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల పొట్టగొట్టే ఏ చట్టానికి కూడా కాంగ్రెస్ మద్దతివ్వబోదని స్పష్టంచేశారు. శుక్రవారం ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి ఆమె ఘాటు లేఖ రాశారు. ‘‘రైతులు, రైతు కూలీల గొంతు వినిపిస్తున్నవారిని హ్రస్వదృష్టి గల మోదీ ప్రభుత్వం అభివృద్ధి నిరోధకులుగా చూపడం దారుణం. ఈ దేశానికి రైతులే వెన్నెముక. వారి జీవనోపాధిని దెబ్బతీసే ఏ చట్టానికి కూడా మేం మద్దతివ్వం’’ అని సోనియా దుయ్యబట్టారు. భూసేకరణ బిల్లును వ్యతిరేకించేవారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కిందటివారం గడ్కారీ.. సోనియా, హజారే సహా పలువురు నేతలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

 

లేఖలో సోనియా ఇంకా ఏమన్నారంటే..


  • పైవేటు కంపెనీల లబ్ధి కోసం సమాజంలోని బలహీనుల హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీపడింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, రైతుల వ్యతిరేకమన్న అభిప్రాయంతో ఇప్పుడు అందరూ ఏకీభవిస్తున్నారు.

  • భూసేకరణ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణలు 2013లో యూపీఏ హయాంలో తీసుకువచ్చిన చట్టం స్ఫూర్తినే నీరుగారుస్తున్నాయి. అందరితో చర్చించే మేం అప్పుడు ఈ చట్టాన్ని తీసుకువచ్చాం. దానికి మీరు(బీజేపీ) కూడా మద్దతు పలికారు.

  • ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా మీరు ఏకపక్షంగా సవరణలు తీసుకువచ్చారు. ఇప్పటికైనా సంకుచిత బుద్ధిని వీడి యూపీఏ హయాం నాటి చట్టాన్ని యథాతథంగా తీసుకురండి.

  • భూసేకరణ చట్టంలో గ్రామీణులు, రైతులు, పేదలు, కూలీల ప్రయోజనాలు కాపాడేందుకు పెద్దపీట వేశామని మీరు(గడ్కారీ) లేఖలో పేర్కొన్న అంశాలన్నీ అసత్యాలే.

  • 2013నాటి చట్టం నుంచి భూసేకరణ సమయంలో సామాజిక ప్రభావం అంచనా నిబంధనను పూర్తిగా తొలగించారు. ఇది రైతు ప్రయోజనాల కోసమా?

  • పైవేటు కంపెనీలు భూసేకరణ చేస్తే 80 శాతం రైతుల అనుమతి తప్పనిసరి అని 2013నాటి చట్టం చెబుతోంది. అదే పీపీపీ ప్రాజెక్టులకు 70 శాతం అనుమతి కావాలని నిర్దేశించింది. ఈ నిబంధనను పూర్తిగా నీరుగార్చడం ఎవరి ప్రయోజనాల కోసం?

  • పారిశ్రామిక కారిడార్ల వరకు మాత్రమే భూసేకరణ చేయాలని 2013 చట్టం చెబుతుంటే.. కారిడార్లకు చుట్టుపక్కల ఒక కిలోమీటరు వరకు భూసేకరణ చేయొచ్చని మీరు సవరణలు తెచ్చారు. ఇది రైతుల ప్రయోజనం కోసమా?


వారి వైఖరి రైతులకు వ్యతిరేకం: వెంకయ్య

భూసేకరణ బిల్లుపై విపక్షాల వైఖరి రైతు ప్రయోజనాలకు వ్యతిరేకమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలన్నీ గ్యాంగ్‌లా మారాయని మండిపడ్డారు. తాము తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేయొద్దు అనుకుంటే.. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చే సుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకు కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టించే యత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము తీసువచ్చిన బిల్లు 99.5 శాతం మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, కేవలం 0.5 శాతం మాత్రమే ప్రభావితమవుతారని చెప్పారు.



చర్చకు నేను సిద్ధం: హజారే

భూసేకరణ బిల్లుపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నా హజారే చెప్పారు. సమయం, వేదిక మోదీయే చెప్పాలన్నారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రి గడ్కారీకి లేఖ రాశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top