కొడుక్కి వింత పరీక్ష పెట్టిన బిలియనీర్!

కొచ్చి బేకరిలో పనిచేస్తున్న ద్రావ్


కొచ్చి/సూరత్: అతడో బిలియనీర్. కోట్లకు పడగెత్తిన అతడికి ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. చేతికి అందొచ్చిన తన కొడుక్కి జీవితం అంటే ఏంటో తెలిపాలనుకున్నాడు. ఉద్యోగాలు, డబ్బు సంపాదించడానికి సామాన్యులు ఎంత కష్టపడుతున్నారో చూపించాలనుకున్నాడు. నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని కొడుకు ఇంటి నుంచి పంపించేశాడు. ఇది సినిమా కథ కాదు. నిజంగా జరిగిన స్టోరి.



గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్‌జీ ఢోలకియా కుమారుడు ద్రావ్య(21) అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకును నెలరోజుల పాటు సామాన్యుడిలా జీవించమని సావ్‌జీ ఆదేశించాడు. జూన్ 21న మూడు జతల బట్టలు, రూ.7 వేలు ఇచ్చి వెళ్లమన్నారు. తాను ఇచ్చిన డబ్బు అత్యవసర సమయాల్లో మాత్రమే వాడాలని, ఫోన్ వినియోగించరాదని షరతులు విధించాడు. తండ్రి ఆదేశాల మేరకు కొచ్చి చేరుకున్న ద్రావ్య మొదట బేకరిలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెల్డొనాల్డ్ అవుట్లెట్ లోనూ పనిచేశాడు. నెల రోజుల్లో రూ. 4 వేలుపైగా సంపాదించాడు. తండ్రి పెట్టిన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుని మంగళవారం ఇంటికి తిరిగొచ్చాడు.



'మొదటి ఐదు రోజులు ఎంత తిరిగినా ఉద్యోగం దొరకలేదు. 60 చోట్లకు వెళ్లినా నిరాశ ఎదురైంది. నేనెవరో తెలియక ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు. అపుడు తెలిసింది ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమని. డబ్బు గురించి ఆలోచించలేదు. నేను సంపాదించిన దాంట్లో రూ.40 పెట్టి భోజనం చేసే వాడిని, లాడ్జికి రోజుకు రూ.250 చొప్పున ఇచ్చాన'ని చెప్పాడు.



'ఇంటి నుంచి పంపేటప్పుడు ద్రావ్యకు మూడు షరతులు పెట్టాను. సొంతం పనిచేసి డబ్బు సంపాదించుకోవాలి. నా పేరు ఎక్కడా వెల్లడించకూడదు. మొబైల్ ఫోన్ వాడకూడదని షరతులు విధించాను. ఇంటి నుంచి తీసుకెళ్లిన  ఏడు వేల రూపాయలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలని చెప్పాను. ఉద్యోగాలు, డబ్బు సంపాదనకు సామాన్యులు పడుతున్న కష్టాల గురించి నా కుమారుడు తెలుసుకోవాలని ఇదంతా చేశాను. జీవిత పాఠాలు ఏ యూనివర్సిటీలోనూ చెప్పరు. అనుభవాన్ని మించిన పాఠం లేద'ని సావ్‌జీ ఢోలకియా అన్నారు.





హరేకృష్ణ డైమండ్ ఎక్స్పోర్ట్స్ పేరుతో సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారం సాగిస్తున్న ఆయన తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గతేడాది దీపావళికి ఖరీదైన బహుమతులు ఇచ్చి పతాక శీర్షికలకు ఎక్కారు. 491 ఫియట్ పుంటో కార్లు, 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. ఇంకా ఆభరణాలు మొదలైనవి ఉద్యోగులకు పంచారు. 71 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఢోలకియా ఆస్తుల విలువ రూ.6000 కోట్లు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top