ఆ పాప చెవి 'గండు చీమల పుట్ట'

ఆ పాప చెవి 'గండు చీమల పుట్ట'


చిట్టి చీమ చెవిలోకెళితేనే మనం ఆ నొప్పి భరించలేం. ఇక అదే గండు చీమైతే గంతులేస్తాం. గుజరాత్‌లోని దీసా గ్రామానికి చెందిన శ్రేయా దర్జీ అనే 12 ఏళ్ల పాప 'ఇయర్ డ్రమ్' మాత్రం గండుచీమల పుట్టగా మారిపోయింది. ఆమె చెవి నుంచి రోజూ పది చొప్పున గండుచీమలు బయటకు వస్తున్నాయి. ఆమెకు చికిత్స అందజేస్తున్న డాక్టర్లు ఇప్పటికే వెయ్యికి పైగా చీమలను బయటకు తీశారు. రకరకాల మందులను ప్రయోగించారు. అయినాసరే, చెవిలో నుంచి చీమల రాక ఆగడం లేదు. వైద్యశాస్త్రంలోనే ఇదో వింతంటున్న వైద్యులు, ఎప్పటికప్పుడు చీమలను బయటకు తీయడం తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేకపోతున్నారు. గతేడాది ఆగస్టులో ఆమె చెవి నుంచి గండు చీమలు బయటకు రావడాన్ని గుర్తించారు. ఆమె ఇయర్ డ్రమ్‌లోనే చీమల బ్రీడింగ్ జరుగుతోందని కొందరు వైద్యులు చెబుతుండగా, మరి కొందరు ఆ వాదనతో విభేదిస్తున్నారు. ఎండోస్కోపీ కెమేరాలను ఉపయోగించి వీడియోలు తీశారు. వాటిలో ఆమె చెవిలో చచ్చిన చీమలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. బయటకు తీశాక చూస్తే అవి బతికే ఉంటున్నాయి. ఇదేమి చీమ చిత్రమని ఈఎన్టీ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.



'అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. ఎమ్మారై, సీటీ స్కాన్లు తీశాం. అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఆమె చెవిలో అసాధారణ మార్పులేమీ కనిపించడం లేదు. ఇయర్ డ్రమ్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. ఆ పాపను చీమలు కుడుతున్నా ఆమెకు ఎలాంటి నొప్పి కలగడం లేదు. అది మరో విచిత్రం' అని ఆమెకు చికిత్స చేసిన గుజరాత్‌లోని ఈఎన్టీ సీనియర్ సర్జన్ డాక్టర్ జవహర్ తల్సానియా (58) తెలిపారు. 'ఆమె దైనందిన జీవితం కూడా సాధారణంగానే ఉంది. ఆ కుటుంబం మురికివాడల్లో కూడా నివసించడం లేదు. ఆరోగ్యకరమైన పరిసరాల్లోనే నివసిస్తోంది. అలాంటప్పుడు ఆమె చెవిలోకి చీమలు దూరే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ వెళ్లినా ఒకటి. రెండు సార్లు వెళ్లవచ్చు గానీ ప్రతిరోజు వెళ్లే అవకాశం ఉండదు' అని తల్సానియా వివరించారు.



'ఒకవేళ చీమలు ఇయర్ డ్రమ్‌లోనే గూడుకట్టుకొని బ్రీడింగ్ చేస్తున్నాయా అంటే అందుకు ఆనవాళ్లు కనిపించడం లేదు. ఎన్ని చీమలను బయటకు తీస్తున్నా వాటిలో రాణీ చీమ కనిపించడం లేదు. రాణీ చీమ దొరికేవరకు ఇయర్ డ్రమ్‌లోనే బ్రీడింగ్ జరుగుతోందని ధ్రువీకరించలేం. చీమలు చచ్చిపోయాలా డ్రాప్స్ వేస్తున్నా వాటికి చీమ కుట్టినట్టు కూడా లేదు' అని తల్సానియా తెలిపారు.



నాటు, మోటు వైద్యాలతోపాటు భూత ప్రేత పిశాచాల వైద్యం కూడా చేయించామని, అయినా తమ కూతురు పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని ఆ పాప తండ్రి 40 ఏళ్ల సంజయ్ దర్జీ వాపోతున్నారు. 'నేను విన్న ప్రతి మంచి వైద్యుడి వద్దకు వెళ్లి పాపను చూపించాను. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో వారంతా విఫలమయ్యారు. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదు. పాప చదువుకు ఎక్కడ అంతరాయం కలుగుతుందో, ఆమె భవిష్యత్తు ఎక్కడ పాడవుతుందోనని భయపడుతున్నాను. ఇప్పటికే వైద్యుల చుట్టూ తిరగడంలో బడికి సరిగ్గా వెళ్లలేక పోయింది. పాప పరిస్థితిని చూసి తోటి పిల్లలు కూడా గేలి చేస్తున్నారు. ఈ కారణంగా ఎక్కడ చదువు ఆపేస్తుందేమోనన్న భయం కూడా నన్ను వెంటాడుతోంది' అంటూ ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top