నోట్లు రద్దు కాగానే 700మందిని వాడాడు

నోట్లు రద్దు కాగానే 700మందిని వాడాడు - Sakshi


అహ్మదాబాద్‌: పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నల్ల డబ్బును రక్షించుకునేందుకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిని బ్యాంకుల వద్ద ఉపయోగించాడు. ఈ విషయం తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అతడు ఉపయోగించినవన్నీ కూడా నకిలీ బ్యాంకు ఖాతాలే. ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీ, స్నాక్స్‌ అమ్ముకొని దాదాపు రూ.650 కోట్లు కూడబెట్టి ఆదాయపన్నుశాఖ అధికారులను అవాక్కయ్యేలా చేసిన గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కిషోర్ భజియావాలా. ఇప్పుడు అతడి గురించి ఈ విస్మయకర విషయమైన తెలసింది.



తొలుత అతడి ఇంటిపై, బంధువుల ఇంటిపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు మొత్తం లెక్క చూపని రూ.10.45కోట్ల డబ్బుతోపాటు దాదాపు 400 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సీబీఐ అధికారులు చేసిన విచారణలో నకిలీ ఖాతాలు సృష్టించడమే కాకుండా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకుల్లో నల్లడబ్బు జమ చేయడం ఆ వెంటనే డ్రా చేసి తెల్లడబ్బుగా మార్చుకోవడం వంటి చర్యలకు దాదాపు 700 మందిని ఉపయోగించినట్లు తెలిసింది.



ఇతడికి మొత్తం 27 బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 20 బినామీల పేరుతో ఉన్నవే. అయితే, ఇప్పటి వరకు అతడు ఎంత డబ్బు జమచేసి విత్‌ డ్రా చేశాడనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే, రూ.1,45,50,800 డబ్బు, రూ.1,48,88,133 విలువైన బంగారం, రూ.4,92,96,314విలువైన వజ్రాలు, ఇతర కోట్ల విలువైన ఆభరణాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారిస్తోంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top