అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!

అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!


ఉత్తరప్రదేశ్లోని బరేలీ వాసులకు అనుకోని పార్టీ దక్కింది. బరేలి సమీపంలోని బడా బైపాస్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ప్రముఖ లిక్కర్ కంపెనీకి చెందిన 'స్ట్రాంగ్' బీరు తీసుకెళ్తున్న లారీ తిరగబడటంతో మొత్తం అందులో ఉన్న బీరు కార్టన్లన్నీ పడిపోయాయి. ఈనోటా, ఆ నోటా ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసింది.



వెంటనే అందరూ జెర్రీ క్యాన్లు, గ్లాసులు, మగ్గులు, జార్లు, చివరకు పాలిథిన్ కవర్లు కూడా పట్టుకుని చేతనైనంత బీరును ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరికొందరు ఔత్సాహికులు అక్కడికక్కడే పొట్టలో పట్టినంత ఎక్కించేశారు. విషయం చుట్టుపక్కల గ్రామస్థులకు కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా గిన్నెలు, చెంబులు పట్టుకుని వచ్చేశారు. దాంతో చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.



లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే బైపాస్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్కు, అతడి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లిద్దరినీ ముందు కాపాడి.. ఆ తర్వాత లారీలో ఉన్న మొత్తం సరుకంతటినీ ఖాళీ చేసేశారు. ఇళ్లలో ఉన్న సామాన్లన్నింటినీ తీసుకొచ్చి, వాటిలో నింపేసుకుని వెళ్లారు. కొంతమంది అయితే, బాగున్న సీసాల కార్టన్లను కార్లలో వేసుకుని కూడా వెళ్లిపోయారు. దారిలో వెళ్లేవాళ్లు కూడా ఆగి.. ఏంటా అని చూసి.. తాము కూడా ఓ చెయ్యేసి బీర్లు తెగ లాగించేశారు. లారీ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఓ సైకిల్ అడ్డం రావడంతో అదుపుతప్పి లారీ బోల్తాపడిందని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి చెప్పాడు. చివరకు సీబీగంజ్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top