పిల్లాడిని కొట్టిచంపిన టీచర్లు!

పిల్లాడిని కొట్టిచంపిన టీచర్లు! - Sakshi


కోల్‌కతా: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే రాక్షసులుగా మారిపోయారు. అభంశుభం తెలియని విద్యార్థిపై విచక్షణా మరిచి తమ ప్రతాపాన్ని చూపారు. భావిపౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతాయుతమైన కొలువులో ఉండి కూడా యమదూతలుగా మారిపోయారు. హాస్టల్‌లో అనుమతి తీసుకోకుండా తల్లిదండ్రులను కలిశాడనే కారణంతో పశ్చిమబెంగాల్‌లో ఓ 12 ఏళ్ల విద్యార్థిని ఉపాధ్యాయులు కొట్టిచంపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.



బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని డాక్ బంగ్లా సమీపంలో ఉన్న అల్ ఇస్లామియా మిషన్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.  12 ఏళ్ల షమీమ్ మాలిక్ సోమవారం సాయంత్రం పాఠశాల బయట తన తల్లిదండ్రులను కలిశాడు. అయితే, హాస్టల్‌లో అనుమతి తీసుకోకుండా క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని హెడ్మాస్టర్ హలిఫ్ షేక్‌, వార్డన్‌ లీటన్ షేక్‌ అతడిను చితకబాదారు. ఒకరి తర్వాత ఒకరు బాలుడిని నిర్దయగా కొట్టారు. దీంతో షమీమ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. చివరివరకు ప్రాణాలతో పోరాడిన షమీమ్ మంగళవారం ఉదయం మరణించాడు. ఈ మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు బాధ్యులైన ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు. అనుమతి తీసుకోకుండా తమను కలిసినందుకు తమ కొడుకుపై టీచర్లు రాక్షసత్వాన్ని ప్రదర్శించారని షమీమ్ తల్లి షమీనా బీబీ పేర్కొంది. ఈ ఘటనలో తమకు న్యాయం చేయాలని ఆ తల్లి దీనం వేడుకుంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top