ప్రగతి మన అభి‘మతం’


మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం

సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం

మతోన్మాదం అభివృద్ధికి చేటు... ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛ ఉంటుంది

రాజ్యాంగాలే ఆ హక్కునిచ్చాయి.. కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది!

మహిళాశక్తిని గుర్తించండి; దేశాభివృద్ధిలో వారు కీలకం

ఐరాస భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు


 

మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు. బీజేపీ నేతల హిందుత్వ వ్యాఖ్యలతో మోదీ సర్కారుపై పడిన ‘మత’ ముద్రపై స్పందనా అన్నట్లుగా.. మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అధికరణలతో సహా గుర్తు చేశారు. మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుందంటూ సున్నితంగా చురకలంటించారు. దాంతో, అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. మోదీ సర్కారుకు చివరకు చేదునే మిగిల్చింది.

 

 ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మంగళవారం ఒబామా ఎంపిక చేసిన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని ఒబామా తేల్చిచెప్పారు. భారత్, అమెరికాల సారూప్యతలను, ఉజ్వలభరితం కానున్న ఇరుదేశాల సంబంధాలను, భారత్‌లోని నారీశక్తిని, యువత సామర్థ్యాన్ని, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భారత్ పోషించాల్సిన పాత్రపై స్ఫూర్తిదాయక దిశానిర్దేశం చేశారు.

 

 ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది. తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు. వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధానయ్యారు.

 

 న్యూఢిల్లీ: సమాజంలో మత సామరస్యం, పరమత సహనం ప్రాధాన్యతలను నొక్కి చెబుతూ.. ‘మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సున్నితంగా హెచ్చరించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను గుర్తు చేస్తూ.. సమాజంలో మత సామరస్యం అవసరాన్ని ఒబామా నొక్కి చెప్పారు. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని తేల్చి చెప్పారు. భారత్, అమెరికా రాజ్యాంగాల్లో మతారాధన హక్కును ప్రసాదించిన అధికరణలను ఉటంకిస్తూ.. ‘ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది’ అని స్పష్టం చేశారు.

 

 బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థలు ఇటీవల చేపట్టిన మత మార్పిళ్ల కార్యక్రమం ‘ఘర్ వాపసీ’.. బీజేపీ ఎంపీలు, హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేస్తున్న మైనారిటీ వ్యతిరేక హిందూత్వ వ్యాఖ్యలు.. వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఒబామా సున్నితంగా చేసిన ఈ  హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మోదీ సర్కారును ఉద్దేశించే ఒబామా ఈ చురకలు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి’ అని ఒబామా పిలుపునిచ్చారు. ‘నేను క్రిస్టియన్‌ను కాదని, ముస్లింన ని చాలా పుకార్లు వచ్చాయి. నేనెవరో తెలియని వారు నా మత విశ్వాసాలను ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి.’ అన్నారు.

 

 ఉత్తేజభరితం.. స్ఫూర్తిదాయకం: గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగా భారత్‌కు వచ్చిన ఒబామా 3 రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. చివరి రోజు మంగళవారం అమెరికాలోని టౌన్‌హాల్ మీటింగ్ తరహాలో.. ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఎంపిక చేసిన దాదాపు 1,500 మంది విద్యార్థులు, మేధావులు, ప్రముఖులనుద్దేశించి ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సతీమణి మిషెల్‌తో కలిసి ఆడిటోరియానికి వచ్చిన ఒబామా.. భారత్, అమెరికా సంబంధాలు, ఇరుదేశాల సారూప్యతలు, భారత్‌లో యువశక్తి, నారీ శక్తి సహా విస్తృతాంశాలను స్పృశిస్తూ దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒబామా ప్రసంగానికి సభికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పర్యటనలో భారతీయ నేతలెవరూ వెంట లేకుండా ఒబామా పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. అనంతరం సౌదీ రాజు అబ్దుల్లా మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు.

 

 సహజమే కాదు.. అత్యుత్తమం కూడా.!

 భారత్, అమెరికాలు సహజ భాగస్వాములు మాత్రమే కాదని, అమెరికా భారత్‌కు అత్యుత్తమ భాగస్వామిగా మారగలదని తన ప్రసంగంలో ఒబామా పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి.’ అన్నారు. పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ప్రశంసించిన ఒబామా.. భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగ వుతున్న కొద్దీ భారత్‌తో మరింత భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటుందన్నారు. ‘మీ దేశంలో రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బుల్లెట్ రైళ్ల వంటి మౌలిక వసతుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం. మీ దేశంలో మరిన్ని నగరాల రూపకల్పనలో భాగస్వాములమవుతాం’ అని  తెలిపారు.

 

 మహిళా శక్తి: భారత్‌లోని మహిళల శక్తి సామర్థ్యాలను ఒబామా గొప్పగా కొనియాడారు. ‘భారత పర్యటనలో నన్ను అత్యంత ఆకట్టుకున్న అంశం.. భారత సాయుధ దళాల్లోని మహిళల అద్భుతమైన శక్తి సామర్థ్యాలు. నేను రాష్ట్రపతిభవన్‌కు వెళ్లినప్పుడు అక్కడ నాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన మహిళా అధికారి ఒక అద్భుతం’ అని వ్యాఖ్యానించారు. ఈ గణతంత్ర కవాతులో మహిళా అధికారులే సాయుధ దళాలకు నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలమని భారతీయ మహిళలు రుజువు చేశారు. ఈ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం.’ అన్నారు. ‘మన కుమారులకు అందించే అన్ని అవకాశాలను కూతుళ్లకు కూడా అందించాలి. ఇంటా, బయటా సురక్షితంగా, గౌరవంగా తన దినచర్యను ప్రతీ మహిళ పూర్తి చేసుకోగలగాలి. ఆ పరిస్థితి కల్పించేందుకు  సోదరులుగా, తండ్రులుగా, భర్తలుగా మనమంతా కృషి చేయాలి’ అని ఒబామా పేర్కొన్నారు. ‘చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది.

 

 అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు’ అన్నారు. తన జీవితంలో తన భార్య మిషెల్, ఇద్దరు కూతుళ్లు పోషిస్తున్న పాత్రను ఒబామా సభికులకు వివరించారు. ‘నా భార్య మిషెల్ చాలా తెలివైంది. నేనేమైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా చెప్తుంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వారికి సమాజ జీవనానికి అవసరమైన ప్రేమ, సానుభూతి, ఆత్మగౌరవం.. మొదలైన ముఖ్యమైన విలువలు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటాం’ అన్నారు. ‘మేం గొప్ప కుటుంబాల నుంచేం రాలేదు. మా చదువే మమ్మల్నిక్కడికి చేర్చింది’ అన్నారు.

 

 వైవిధ్యత, భిన్నత్వం: భిన్నత్వం, వైవిధ్యతల్లో భారత్, అమెరికాలకు సారూప్యత ఉందని ఒబామా పేర్కొన్నారు. ‘ఆ వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధాని అయ్యారు. భారత్‌లో అనేక మతాలు, కులాలు, వర్ణాలు, భాషలు ఉన్నాయి. అవే భారత్ బలం. అమెరికాలోనూ శ్వేతజాతీయులు, నల్లవారు, లాటనో, ఇండో అమెరికన్, ఆసియన్, లాటినో అమెరికన్.. ఇలా విభిన్న జాతులున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ సమానమేనని మన రాజ్యాంగాల్లో స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం’ అన్నారు. ‘మన రెండు దేశాల చరిత్ర వేరుకావచ్చు. వేర్వేరు భాషలు మాట్లాడుతాం కావచ్చు. కానీ సమాజంలో వేళ్లూనుకున్న విలువల పరంగా మనమొకటే. అందుకే మనం ఒకరికొకరం ప్రతిబింబాలుగా కన్పిస్తాం’ అన్నారు. వందేళ్లక్రితం స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన ప్రసంగాన్ని ఒబామా ప్రస్తావించారు. ‘స్వామి వివేకానంద నా సొంత నగరం చికాగో వచ్చారు. అక్కడి ప్రజలను భారతదేశ సోదర, సోదరీమణులారా అని సంబోధించారు. నేనూ మిమ్మల్ని అలాగే సంబోధించాలనుకుంటున్నాను’ అన్నారు.

 

 నేనూ వివక్ష ఎదుర్కొన్నా: ‘అమెరికాలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నప్పటికీ.. నా చర్మం రంగు కారణంగా నేనూ అసమానతను, వివక్షను ఎదుర్కొన్నా’ అని గుర్తు చేసుకుంటూ.. ఇతరుల ఆశలను, ఆశయాలనూ గౌరవించాలని అభ్యర్థించారు.

 

 వాతావరణ మార్పును ఎదుర్కొందాం: భారత్ లాంటి దేశాలు స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు మళ్లనట్లయితే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని ఒబామా హెచ్చరించారు. ‘గత వందేళ్లుగా శిలాజ ఇంధనాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందిన మేం.. ఇప్పుడు భారత్ లాంటి దేశాలను ఆ ఇంధనం వాడకూడదని చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారన్న విషయం నాకు తెలుసు. కానీ అంతర్జాతీయ భాగస్వామ్యమంటే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడమే’ అని స్పష్టం చేశారు.

 

 భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు

 ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణల ఆవశ్యకత ఉందన్న ఒబామా.. భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు అమెరికా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకశక్తిగా ఎదగాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యం నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలోని ఇతర దేశాల అభివృద్ధికి భారత్ తోడ్పడాలని సూచించారు. ‘ఎన్నికల నిర్వహణలో మీకున్న అనుభవాన్ని, నైపుణ్యాన్ని మయన్మార్, శ్రీలంక తదితర దేశాల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఉపయోగించండి’ అన్నారు. వైద్య రంగంలోని నైపుణ్యాన్ని మరిన్ని టీకాల తయారీకి ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా శిశుమరణాలను అడ్డుకోవాలని కోరారు.   

 

 రెండు దేశాలు.. ఒకే భావన

 భారత్, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయని, రెండు దేశాల మధ్య ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలున్నాయని, రెండు దేశాల్లోనూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిఖ్ లు, యూదులు తదితర భిన్న మతస్థులు సహజీవనం చేస్తున్నారని ఒబామా గుర్తు చేశారు. ‘అమెరికా వ్యవస్థాపక పత్రాల్లో, భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలో మతస్వేచ్ఛ హక్కును, మత ప్రచార హక్కును స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ‘రెండు దేశాలూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ఆ బాధను భరించాయి. అందుకే రక్షణ, పరస్పర భద్రత అంశాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాం. అణ్వాయుధాలు లేని ప్రపంచం మన లక్ష్యం. ఆ దిశగా కలిసి కృషి చేయాలి’ అన్నారు. మూడేళ్ల క్రితం యూఎస్‌లోని విస్కాన్సిస్ గురుద్వారాలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయాన్ని ఒబామా గుర్తు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top