పేదల కోసం జనసురక్ష

పేదల కోసం జనసురక్ష


- తక్కువ ప్రీమియంతో బీమా

- ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా

- రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా

- రూ.వెయ్యి ప్రీమియంతో

- అటల్ పెన్షన్ యోజనతక్కువ ప్రీమియంతో బీమా

- ఏడాదికి రూ.12కే రెండు లక్షల ప్రమాద మరణ బీమా

- రూపాయి కంటే తక్కువ ప్రీమియంతో జీవిత బీమా

- రూ.వెయ్యి ప్రీమియంతో అటల్ పెన్షన్ యోజన




న్యూఢిల్లీ: ప్రజలందరికీ బీమా సౌకర్యం ఉండేలా జైట్లీ మూడు పథకాలను బడ్జెట్‌లో ప్రకటించారు. దామాషా ప్రకారం చూస్తే దేశంలోని ఎక్కువమంది ప్రజలు ఎలాంటి బీమా పథకం లేకుండానే ఉన్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన విజయవంతమైనట్లే.. భారతీయులందరికీ సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రమాద, జీవిత బీమా, పెన్షన్ పథకాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో మొదటిది ‘ప్రధానమంత్రి సురక్షా బీమా’. దీని కింద ఏడాదికి కేవలం రూ.12 అంటే నెలకు రూపాయి చొప్పున ప్రీమియం కడితే రూ.2 లక్షల  ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది.  ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు బీమా కింద లభిస్తుంది.

 

జైట్లీ ‘అటల్ పెన్షన్’ పథకాన్నీ ప్రకటించారు. ఏడాదికి కనీసంగా రూ.వెయ్యి చొప్పున ఐదేళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే, లబ్ధిదారులు చెల్లించే మొత్తానికి ప్రభుత్వం 50% పెన్షన్‌గా చెల్లిస్తుంది. 2015 డిసెంబర్ 31 వరకు బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరిచిన వారికే  ఈ పథకం వర్తిస్తుంది. జైట్లీ ప్రకటించిన మూడో పథకం జీవిత బీమాకు సంబంధించిన ‘ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన’. ఈ పథకం సహజ, ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల వారు ఏడాదికి రూ.330 (అంటే, రోజుకు రూపాయి కంటే తక్కువ) ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ బీమా కింద లబ్ధిదారులకు రూ.2 లక్షలు చెల్లిస్తారు.

 

సీనియర్ సిటిజన్లకూ వరాలు

దేశంలో 80 సంవత్సరాల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు దాదాపు కోటి మంది వరకు ఉన్నారని జైట్లీ అన్నారు. వీరిలో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. వీరిలోనూ ఎక్కువమంది  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారేనన్నారు. ఇలాంటి సీనియర్ సిటిజన్లకు వయసు కారణంగా వచ్చే వివిధ వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామన్నారు. వృద్ధాప్యం లో ఏ ఒక్కరూ బాధ పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎస్సీలకు రూ. 30,851 కోట్లు, ఎస్టీలకు రూ.19,980 కోట్లు, మహిళలకు రూ. 79,258 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పారసీల నాగరికత, సంస్కృతిలను కాపాడటానికి ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, 2015-16లో జరిగే ‘ది ఎవర్ లాస్టింగ్ ఫ్లేమ్’ ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top