భారత రత్న.. వాజ్‌పేయి!

భారత రత్న.. వాజ్‌పేయి! - Sakshi


న్యూఢిల్లీ: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞ దిగ్గజం, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. తొలిసారి, ప్రొటోకాల్‌ను కాదని, రాష్ట్రపతి భవన్‌లో కాకుండా, వాజ్‌పేయి నివాసానికి స్వయంగా వచ్చి.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని శుక్రవారం ఆ దార్శనిక నేతకు అందజేశారు. ఐదేళ్లూ విజయవంతంగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించిన.. 5 దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్‌గా సేవలందించిన అటల్‌జీ ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో తీవ్రమైన వృద్ధాప్య సమస్యలతో కదల్లేని స్థితిలో ఉండడం తెలిసిందే.



ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లో ఉన్న వాజ్‌పేయి నివాసంలో కొద్దిమంది ఆహూతుల సమక్షంలో ప్రత్యేకంగా జరిగిన ఈ వేడుకకు హాజరైన వారిలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్,  వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమిత, అల్లుడు రంజన్ భట్టాచార్య తదితరులు ఉన్నారు. అనంతరం ప్రశంసాపత్రం చదివి వినిపించారు.



‘అందరినీ కలుపుకుపోయి, ఒక్కతాటిపైకి తీసుకువచ్చిన చురుకైన రాజనీతిజ్ఙుడు వాజ్‌పేయి. పాకిస్తాన్‌తో చర్చలను ప్రారంభించే విషయంలో సహచరులు, ప్రతిపక్షాలను కాదని అంతరాత్మనే నమ్ముకుని ముందడుగు వేశారు’ అని అందులో పేర్కొన్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత  అద్వానీ, ఆరెస్సెస్ చీఫ్  భాగవత్, పలువురు కేంద్రమంత్రులు, సీఎంలుప్రకాశ్‌సింగ్ బాదల్(పంజాబ్), వసుంధర రాజే(రాజస్తాన్), శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్), సయీద్(జమ్మూకశ్మీర్), చంద్రబాబునాయుడు(ఆంధ్రప్రదేశ్) తదితరులు పాల్గొన్నారు. వాజ్‌పేయికి భారతరత్న ప్రదానం చేయడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాజ్‌పేయికి గత ఏడాది డిసెంబర్ 24న, తన 90వ జన్మదినోత్సవానికి ఒకరోజు ముందు భారత రత్న ప్రకటించడం తెలిసిందే. 



భరతమాత ముద్దుబిడ్డ.. వాజ్‌పేయి తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన స్ఫూర్తిదాయక నేత అని మోదీ కొనియాడారు. అటల్‌జీని భరతమాత ముద్దుబిడ్డగా అభివర్ణించారు. స్వయంగా వాజ్‌పేయి నివాసానికి వచ్చి ఈ పురస్కారాన్ని అందజేసిన రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘అటల్‌జీ అనుక్షణం దేశం గురించే ఆలోచించే అసమాన నేత ఆయన. ఈ దేశంలో నాలాంటి కోట్లాదిమందికి ఆయనే స్ఫూర్తి.  ఆయన జీవితం మాకు ఇలాగే స్ఫూర్తినిస్తూ ఉండాలని  భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అన్నారు. భారతీయులకు ఇది చరిత్రాత్మకమైన రోజంటూ ఆ తరువాత ట్వీట్ చేశారు. అనారోగ్యం వల్ల వాజ్‌పేయిజీ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆయనింట్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అరుణ్‌జైట్లీ తెలిపారు. వాజ్‌పేయికి భారతరత్న ప్రదానం చేయడంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా హర్షం వ్యక్తం చేశారు.



అణు పరీక్షల సాహసం.. దేశ విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడిగా పేరుగాంచిన వాజ్‌పేయి 1998 నుంచి 2004 వరకు ప్రధానిగా ఉన్నారు. పాక్‌తో సంబంధాల కోసం ప్రధానిగా ఆయన చేపట్టిన లాహోర్ బస్సు యాత్ర(1999), అప్పటి పాక్ ప్రధాని నవాజ్‌తో కలసి విడుదల చేసిన లాహోర్ ప్రకటన,   విమర్శకుల ప్రశంసలనందుకున్నాయి.  1998-99 మధ్య ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన అణు పరీక్షలు అత్యంత సాహసంగా  భావిస్తారు. 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన పదిసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.



అనారోగ్యం ఏమిటి?

2009లో వాజ్‌పేయి గుండెపోటుకు గురయ్యారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు మాట పడిపోయిన పరిస్థితి. క్రమంగా మనుషులను గుర్తుపట్టే సామర్థ్యాన్ని  కోల్పోయారు. ప్రస్తుతం మంచంపై నుంచి లేవలేని పరిస్థితిలో ఉండటంతో సహాయకులే అన్నివిధాలుగా చూసుకుంటున్నారు. స్పాంజ్‌తో శరీరాన్ని శుభ్రం చేయడం, దుస్తులు మార్చడం, సమయానికి అన్నీ అమర్చడం మొదలైనవన్నీ  చేస్తున్నారు. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు మాత్రమే బయటకు తీసుకువెళ్తున్నారు. దీర్ఘకాలిక డయాబెటిస్, డిమెన్షియా(జ్ఞాపకశక్తి, హేతుబద్ధత కోల్పోవడం)తో ఆయన బాధపడుతున్నారని సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top