చైనాకు అమెరికా దెబ్బ.. ఆసియా శక్తిగా భారత్‌!

చైనాకు అమెరికా దెబ్బ.. ఆసియా శక్తిగా భారత్‌! - Sakshi


న్యూఢిల్లీ: ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. ప్రస్తుతం దిగ్గజ దేశాలు చైనా, అమెరికా పరిస్ధితి ఇలానే తయారయింది. దీంతో ఆసియాలో కొత్త శక్తిగా అవతరించే అవకాశాన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలని చూస్తోంది. దక్షిణ చైనా సముద్రం, ఐల్యాండ్‌ సమస్యలపై చైనా గిల్లికజ్జాలు పెట్టుకోవడంతో మిగిలిన ఆసియా దేశాలతో పాటు అమెరికాకు కూడా దూరమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చైనా నిర్మిస్తున్న ఐల్యాండ్‌కు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైనా వ్యాపార సంబంధాలు దారుణంగా మారాయి. ఒబామా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌(టీపీపీ) వ్యాపార సంబంధాలపై దృష్టి సారించగా.. చైనాపై ఉన్న వ్యతిరేకతతో ట్రంప్‌ క్యాబినేట్‌ అందుకు దూరంగా అడుగులు వేస్తోంది.



టీపీపీలో మొత్తం 12 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాపారంలో 40శాతం టీపీపీ దేశాల మధ్యే జరుగుతుంది. తాజా పరిస్ధితుల నడుమ టీపీపీలో చైనాకు ఉన్న వ్యాపార కార్యకలాపాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీపీపీలో భాగస్వాములైన కొన్ని దేశాలతో సంబంధాలను మరింత ధృడం చేసుకుని ఆసియాలో కొత్త శక్తిగా అవతరించే అవకాశాన్ని భారత్‌ వదులుకునేలా కనిపించడం లేదు. వచ్చే కొద్ది వారాల్లో వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి ఫమ్‌ బిన్హ్‌ మిన్హ్, ఆ దేశ ఉపాధ్యక్షుడుచ మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌లు భారత పర్యటనకు రానున్నారు. ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి ఏప్రిల్‌లో షేక్‌ హసీనా, ఈ ఏడాది ప్రధమార్ధంలోనే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్న్‌బుల్‌ కూడా భారత్‌కు విచ్చేయనున్నట్లు తెలిసింది. కాగా భారత విదేశాంగ కార్యదర్శి ఎస్‌ జయశంకర్‌ ప్రస్తుతం శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్‌ల పర్యటనలో ఉన్నారు.



ఆసియాలో ఫిలిప్పీన్స్‌తో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలోని స్కార్‌బరో షోల్‌లో చైనా నిర్మాణాలను చేపడుతోంది. ఈ విషయంపై ఫిలిప్పీన్స్‌, అమెరికాలో గుర్రుగా ఉన్నాయి. టీపీపీ వ్యాపారసంబంధాలు సన్నగిల్లుతుండటంతో వియత్నాం ఇప్పటికే భారత్‌, జపాన్‌లతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. అయితే వియత్నాం విషయంలో అమెరికా ఇంకా తన వ్యూహాన్ని ప్రదర్శించలేదు. త్వరలో భారత పర్యటనకు రానున్న వియత్నాం లీడర్లు ఈ విషయంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాగా, మలేసియా, శ్రీలంకలు ఇప్పటికే చైనా వైపు మొగ్గు చూపాయి. మలేసియన్‌ పోర్టుల్లో చైనా నౌకలు ఆశ్రయం పొందుతున్నాయి. ఇరుదేశాలు చైనా నుంచి సబ్‌మెరైన్‌లను కూడా కొనుగోలు చేశాయి కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top