'సీఎం చెప్పారని ఆయన నన్ను దూషించారు'

'సీఎం చెప్పారని ఆయన నన్ను దూషించారు'


న్యూఢిల్లీ: తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడంపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అందుకు కేజ్రీవాల్‌కు నాలుగు వారాలు గడువిచ్చింది. తనను దూషించాలని, తనపై అసభ్య పదజాలం వాడాలని కేజ్రీవాల్ తన లాయర్ రామ్ జెఠ్మాలానీకి సూచించినట్లు అరుణ్ జైట్లీ కోర్టుకు బుధవారం మరోసారి తెలిపారు.



కేజ్రీవాల్‌పై గతంలో దాఖలైన పిటిషన్ విచారణ గత మే 15, 17 తేదీల్లో విచారణ సాగుతుండగా సీనియర్ లాయర్ రాం జెఠ్మలానీ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని జైట్లీ తన రెండో పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. తన ప్రతిష్టకు భంగంకలిగించే వ్యాఖ్యలు చేశారంటూ కేజ్రీవాల్‌పై జైట్లీ రూ. 10 కోట్ల దావా వేశారు. అయితే కేసు విచారణ కొనసాగుతుండగా జెఠ్మలానీ తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ కేసు వాదించారని జైట్లీ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. కేజ్రీ చెబితేనే తాను అసభ్య పదజాలం వాడినట్లు జెఠ్మలానీ తనకు ఓ లేఖ ద్వారా తెలిపినట్లు కోర్టులో జైట్లీ వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఆప్ అధినేత కేజ్రీకి నాలుగు వారాలు గడువిస్తూ లిఖిత పూర్వకంగా తప్పుడు అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.



జైట్లీని దూషించాలని కేజ్రీవాల్ తనకు సూచించారని జెఠ్మలానీ వెల్లడించడంతో కేజ్రీ కష్టాలు మొదటికొచ్చాయి. తాను జెఠ్మాలానీకి ఇలాంటి విషయాలు సూచించలేదని కేజ్రీవాల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయగా.. ఢిల్లీ సీఎం అబద్ధాలు చెప్తున్నారని, ఈ కేసులో తాను, కేజ్రీవాల్‌ చర్చించుకున్న విషయాలు ఉన్న లేఖను బయటపెడతానని జెఠ్మలానీ హెచ్చరించిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో ఈ పరువునష్టం కేసులో ఇక ఎంతమాత్రం కేజ్రీవాల్‌ తరఫున వాదించబోనంటూ జెఠ్మలానీ స్పష్టం చేశారు. కేసు వాదన నుంచి జెఠ్మలానీ తప్పుకోవడం, ఆయన సూచించిన కారణంగా తనపై జెఠ్మలానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని జైట్లీ కోర్టులో పేర్కొనడంతో కేజ్రీ చుట్టు ఉచ్చు మరింత బిగుసుకున్నట్లు కనిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top