లైంగిక వేధింపుల కేసు: సీఈఓ రాజీనామా

లైంగిక వేధింపుల కేసు: సీఈఓ రాజీనామా - Sakshi


ముంబై :

తనతోపాటు పనిచేసిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 'ది వైరల్‌ ఫీవర్'‌(టీవీఎఫ్‌) వ్యవస్థాపకుడు అరుణబ్ కుమార్‌ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 'ఇటీవలి కాలంలో నాపై వస్తున్న తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా కలత చెందా. వాటి ప్రభావం సంస్థ మీద పడకుండా టీవీఎఫ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. అయితే కంటెంట్ టీం సభ్యులకు ఓ మెంటర్గా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా' అని అరుణబ్ కుమార్‌ పేర్కొన్నారు. దావల్ గుసెన్ తదుపరి సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.      



తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ టీవీఎఫ్‌ సంస్థలో పనిచేసిన ఓ మహిళ అరునాభ్‌ కుమార్‌ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడిపై సెక్షన్ 354 ఎ (లైంగిక వేధింపులకు పాల్పడటం), 509 (అసభ్య పదాలు, చేష్టలు, చర్యల ద్వారా ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.



అయితే ఇలాంటి కేసు మరొకటి ముంబైలోని వర్సోవా పోలీస్ స్టేషన్లో నమోదైంది. తాను 2014 నుంచి 2016 వరకు టీవీఎఫ్‌లో పనిచేసినప్పుడు కుమార్ తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ తన బ్లాగులో రాసుకుంది. ఆ పోస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో చాలామంది తాము కూడా అలాగే అతడి వేధింపులకు గురయ్యామని అక్కడ రాశారు. దీంతో సోషల్ మీడియాలో అరుణబ్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఐఐటీ గ్రాడ్యువేట్ అయిన అరుణబ్ టీవీఎఫ్ను 2011లో స్థాపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top