కళలు సామాన్యులకు చేరాలి: మోదీ

కళలు సామాన్యులకు చేరాలి: మోదీ - Sakshi


ముంబై: చిత్రలేఖనం, శిల్పం, సంగీతం వంటి కళలు సమయం, కులం, మతం, జాతులకు అతీతమైనవని, వీటికి ఎలాంటి హద్దులు లేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కళలను సామాన్యులకు చేరువ చేయాలని, వీటి ద్వారా స్వచ్ఛభారత్ వంటి సామాజిక అంశాల విషయంలో ప్రజల్లో చైతన్యం నింపాలని ఆయన కోరారు. మాటలకంటే కళారూపాల్లో ఇచ్చే సందేశాలే ప్రజలకు సులభంగా అర్థమవుతాయని మోదీ పేర్కొన్నారు. శనివారం ప్రధాని ముంబైలోని బాంద్రాలో బాంబే ఆర్ట్ గ్యాలరీ నూతన భవనాన్ని ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, కళలు ధనికవర్గాలకే పరిమితం కాకూడదని అన్నారు. సమాజానికి అవి దన్నుగా ఉండాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపై ఉండే ఖాళీ ప్రదేశాల్లో యువకళాకారులు తమ పెయింటింగ్‌లు, ఇతర కళారూపాలను ప్రదర్శించడానికి వీలుకల్పించాలని సూచించారు. ఈ విషయంలో తాను రైల్వే శాఖతో మాట్లాడానని చెప్పారు. తద్వారా సామాజిక సందేశాలను ప్రజలకు చేరువచేయవచ్చని అన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో మాటలకంటే కళారూపాలద్వారానే ప్రజలను చైతన్యపరచడానికి ఎక్కువ అవకాశముంటుందన్నారు. పెయింటింగ్‌లు, ఇతర కళారూపాలను తీర్చిదిద్దే ప్రక్రియలో డిజిటల్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసులోనే కళలపట్ల ఆసక్తి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులను తరచూ ఆర్ట్ గ్యాలరీలకు తీసుకెళ్లాలని పాఠశాలలకు సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top