'ఏమ్మా.. నీకు నాపై కోపంగా ఉందా?'

'ఏమ్మా.. నీకు నాపై కోపంగా ఉందా?'


న్యూఢిల్లీ: 'ఏమ్మా.. నీకు నాపై కోపంగా ఉందా' అంటూ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కశ్మీర్ బలగాల కాల్పుల్లో కంటిచూపు కోల్పోయిన బాధితురాలు ఇన్షా మాలిక్ను సఫ్దార్ జంగ్ ఆస్పత్రిలో అడిగారు. దీంతో ఆమె పక్కనే ఉన్న ఆ పాప తల్లి బోరుమని ఏడ్చింది. ఆ సన్నివేశం చూసి ముఖ్యమంత్రి ముఫ్తీ చలించిపోయారు. ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.



ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో అల్లర్ల నేపథ్యంలో ఆందోళన పరిస్థితులు ఉన్న విషయం తెలిసిందే. దీని నుంచి బయటపడేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ముఫ్తీ పెల్లెట్ గన్స్ బాధితులను పరామర్శించారు. 'నేను 16 ఏళ్ల ఇన్షాను ఆస్పత్రిలో కలిశాను. ఆమెను చూడగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. నాపై నీకు కోపంగా ఉందా అని ప్రశ్నించా.. ఆ మాటతో పక్కనే ఉన్న ఇన్షా తల్లి బోరుమని ఏడ్చింది. మేం ఎక్కడ తప్పు చేశామా నాలో నేను ప్రశ్నించుకున్నాను' అని ముఫ్తీ చెప్పారు.



అనంతరం వైద్యులతో ఆ పాప చూపు గురించి మాట్లాడిన ముఫ్తీ తిరిగి తను ప్రపంచాన్ని చూసేందుకు ఉన్న అన్ని అవకాశాల్లో ప్రయత్నించాలని కోరారు. ఇన్షా కుటుంబానికి కూడా ఆమె హామీ ఇచ్చారు. తిరిగి ఆ పాప ఈ లోకాన్ని చూస్తుందని భరోసా ఇచ్చారు. మొత్తం వ్యయం ప్రభుత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇన్షా తొమ్మిదో తరగతి చదువుతోంది. అల్లర్లను అదుపు చేసే క్రమంలో బలగాలు ప్రయోగించిన పెల్లెట్స్ తాకి తన కంటిచూపును కోల్పోయింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top