ఆహా ఏమిరుచి!

ఆహా ఏమిరుచి! - Sakshi


- అమ్మ క్యాంటీన్లలో ఆంధ్ర మంత్రుల ఆనందం

- చెన్నైకి దీటుగా అన్న క్యాంటీన్లని వెల్లడి

చెన్నై, సాక్షి ప్రతినిధి:
‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ రాగం తీశారు అమ్మ క్యాంటీన్లను సందర్శించిన ఆంధ్ర మంత్రులు. మధ్యాహ్న భోజనానికి వినియోగదారుల కోసం సిద్ధం చేసిన నిమ్మకాయ అన్నం, సాంబారు అన్నం, పెరుగన్నాన్ని ఆరగించి ఆనందించారు. చెన్నైకి ఏమాత్రం తీసిపోని రీతిలో ఆంధ్రాలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని శుక్రవారం పర్యటనలో వెల్లడించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పేదలపై పడకుండా చౌకధరలకే ఆహారం లభించేలా ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన చెన్నైలో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు.



కార్పొరేషన్ పరిధిలోని 200 వార్డుల్లో వార్డుకు ఒకటి చొప్పున 200, మూడు ప్రభుతాస్పత్రుల్లోనూ మొత్తం 203 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఒకరూపాయికే ఇడ్లీ, రూ.5కు పొంగల్, మధ్యాహ్నం రూ.5కు సాంబార్, నిమ్మకాయ అన్నం, రూ.3కు పెరుగన్నం అందిస్తున్నారు. రాత్రిపూట రూ.3కు మూడు చపాతీలు పెడుతున్నారు. ఈ కాంటీన్లు పెద్దఎత్తున ప్రజాదరణ పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అన్న క్యాంటీన్ల పేరుతో ఇదే తరహా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘంగా ఏర్పడిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మునిసిపల్ మంత్రి నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం చెన్నైలోని అమ్మ క్యాంటీన్లను సందర్శించారు.



చేపాక్ ప్రభుత్వ అతిథిగృహం నుంచి 11.30 గంటలకు బయలుదేరిన మంత్రులు ముందుగా సాంతోమ్ చర్చిరోడ్డులో సీఎం జయ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకున్న అమ్మ క్యాంటీన్‌కు వెళ్లా రు. అక్కడి వంటకాలను ముగ్గురు మం త్రులు రుచిచూశారు. వంటగది, స్టోర్‌రూములను సందర్శించారు. సిబ్బంది నుంచి జమా ఖర్చుల వివరాలు సేకరించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని మేయర్ సైదై దొరస్వామి, కమిషనర్ విక్రమ్ కపూర్‌తో సమావేశమై అమ్మ క్యాంటీన్లపై వారిచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. అక్కడి నుంచి రాజీవ్ ప్రభుత్వాస్పత్రి(జీహెచ్)లోని అమ్మ క్యాంటీన్‌ను సందర్శించారు.

 

నాలుగు జిల్లాలు - 35 క్యాంటీన్లు

చెన్నై తరహా అమ్మ క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్‌లో ‘అన్న క్యాంటీన్ల’ పేరుతోప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడి ంచారు. అమ్మ క్యాంటీన్లను అధ్యయనంచేసిరమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు చెన్నైలో పర్యటించినట్లు తెలిపారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణ, పనితీరు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఆహార పదార్థాలు సైతం ఎంతో రుచికరంగా ఉన్నాయని ప్రశంసించారు. పూర్తిగా మహిళలే పర్యవేక్షిస్తున్నా జమా ఖర్చుల లెడ్జర్‌ను చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు.



పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో 35 క్యాంటీన్లను నవంబర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, అనంతపురంలో 5, తిరుపతి 5  మొత్తం 35 క్యాంటీన్లను పరిచయం చే యనున్నట్లు వారు వెల్లడించారు. మునిసిపల్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డైరక్టర్ వాణిమోహన్, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కాంతీలాల్ దండే, సాల్మన్ ఆరోగ్యరాజ్, సిద్ధార్థ్‌జైన్, విశాఖపట్నం జాయింట కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆయా జిల్లాల మునిసిపల్ కమిషనర్లు, పౌరసరఫరాల అధికారులు, మేనేజర్లు, ప్రజాప్రతినిధులు మంత్రుల పర్యటనలో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top