ఎరుపెక్కిన ఏఓబీ

ఎరుపెక్కిన ఏఓబీ - Sakshi


ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

- మృతుల్లో కీలకనేతలు గాజర్ల రవి, వెంకటరమణ, శ్యామల కిష్టయ్య, ప్రమీల, చలపతి, అరుణ

- 11 మంది మహిళా మావోయిస్టులు కూడా..

- తప్పించుకున్న అగ్రనేత ఆర్కే.. తనయుడు మృతి

- పలువురు మావోయిస్టులకు గాయాలు

- కాల్పుల్లో మరణించిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్

- మావోయిస్టుల మృతదేహాలు మల్కన్‌గిరికి తరలింపు

- గాయపడిన కానిస్టేబుళ్లు విశాఖకు తరలింపు

- ఘటనా స్థలంలో భారీగా ఆయుధాల స్వాధీనం

 

 సోమవారం.. కాసేపట్లో తెల్లవారుతుంది అనగా ఏఓబీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. రక్తం ఏరులై పారింది. మావోయిస్టులను చుట్టుముట్టిన గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మావోయిస్టులను పెద్ద సంఖ్యలో మట్టుబెట్టాయి. విశాఖ జిల్లాకు సుమారు 9 కి.మీల దూరంలోని ఒడిశా సరిహద్దులో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారని సమాచారం.


 

 

 ఏఒబీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక బృందం

 తెల్లవారుఝాము.. కాసేపట్లో తెలవారుతుందనగా ఆంధ్ర - ఒడిశా బోర్డర్ (ఏఓబీ) తుపాకుల మోతతో దద్దరిల్లింది. రక్తం ఏరులై పారింది. మావోయిస్టులను చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్‌పార్టీ బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మావోయిస్టులను పెద్ద సంఖ్యలో మట్టుబెట్టాయి. దేశచరిత్రలోనే మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఎదురుదెబ్బ తిన్నారు. విశాఖ జిల్లాకు సుమారు 9 కి.మీల దూరంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 24 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో 11 మంది మహిళలు కూడా ఉన్నారని సమాచారం.



మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో మరణించడం ఇదే ప్రథమం. మహిళా మావోయిస్టులు కూడా ఇంతమంది ఒక ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడం కూడా ఇదే మొదటిదని అంటున్నారు. ఓ గ్రేహౌండ్స్ కమెండో మృతి చెందగా మరో కమెండో ఇంకా పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. మరణించినవారిలో మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే రవి మరణాన్ని పోలీసులు ధృవీకరించలేదు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే ఈ ఎన్‌కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకోగా ఆర్కే కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మరణించారని సమాచారం. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టు నేతల కోసం గ్రేహౌండ్స్ దళాలు ఏఓబీ ప్రాంతంలో కూం బింగ్‌ను మరింత ముమ్మ రం చేశాయి. భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలనుఅప్రమత్తం చేశాయి. దాంతో ఈ ఆరు రాష్ట్రాలలో వీఐపీల భద్రతను   కట్టుదిట్టం చేశారు.  

 

 పక్కా సమాచారంతోనే..


 మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతోనే గత కొద్ది రోజుల నుంచి గ్రేహౌండ్స్ దళాలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. డిసెంబర్ 3 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు నిర్వహించడంలో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జంత్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు.. అందులో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణతోపాటు పలువురు కీలక నేతలు పాల్గొం టున్నట్టు అందిన సమాచారం మేరకు వందల సంఖ్యలో కూంబింగ్ దళాలు అటువైపు కదిలాయి. కడుములగుమ్మ సమితి పరిధిలోని రామ్‌గడ్-పనసపుట్ మధ్య ఉన్న మావోయిస్టు శిబిరాలను ఆదివారం రాత్రే చుట్టుముట్టాయి.



ముందుజాగ్రత్తగా ఈ ప్రాంతానికి 9 కిలోమీటర్లు దూరంలో దళాలు తమ వాహనాలను వదిలి సెల్ ఫోన్లు సైతం కట్టేసి కాలినడకన అక్కడికి చేరుకున్నాయి. రూడకోట ప్రాంతంలోని పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4-5 గంటల మధ్య పోలీసు బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన గ్రేహౌండ్స్ దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. భీకరంగా జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో 23 మంది మావోయిస్టులు హతం కాగా,  కడప 11వ బెటాలియన్‌కు చెందిన  సీనియర్ కమెండో అబుబాకర్(27)తో పాటు విశాఖ జిల్లాకు చెందిన మరో కమెండో దొంతల సతీష్‌కు బుల్లెట్ గాయాలు తగిలాయి.



వీరిని హెలికాప్టర్‌లో హుటాహుటిన విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అబుబాకర్ మృతి చెందగా, మృత దేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఎన్‌కౌంటర్ విషయం తెలియగానే విశాఖ జిల్లా ఎస్పీ రాహల్‌దేవ్ శర్మ హెలికాప్టర్‌లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడి ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మావోయిస్టుల మృతదేహాలను 72 గంటలపాటు తాము భద్రపరుస్తామని, ఆ లోగా కుటుంబసభ్యులు వస్తే అప్పగిస్తామని లేదంటే ఖననం చేస్తామని విశాఖ, మల్కన్‌గిరి ఎస్పీలు తెలిపారు.  



 రెండోసారి ఎదురుకాల్పులు.. మహిళా మావోయిస్టు మృతి

 ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో సోమవారం ఉదయం 9-10 మధ్యలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. తెల్లవారుఝామున జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నట్టు గ్రే హౌండ్స్ బలగాలు గుర్తించాయి. సంఘటనా స్థలంలో 40 కిట్‌లుండగా, తొలుత ఎన్ కౌంటర్ ప్రాంతంలో 20 మంది మృతదేహాలనే గుర్తించారు. గాలింపు జరపగా బలిమెల రిజర్వాయర్ ప్రాంతంలో మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు కనిపించాయి. దీంతో మిగిలిన వారు నదిదాటి పరారై ఉంటారని భావించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో నది ఆవల కొంతమంది మావోయిస్టులు ఉదయం 9 దాటిన తర్వాత కాల్పులు ప్రారంభించగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్టు ఎస్పీ నిర్ధారించారు.



 అస్తమించిన రవి సామ్రాజ్యం

 మావోయిస్టు నాయకుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ మల్కన్‌గిరి, కోరాపుట్, విశాఖ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. రవి మృతితో ఏవోబీలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరిలో 2003లో జరిగిన దాడిలో రవి పాల్గొన్నారు.  పోలీసు వాహనాల పేల్చివేత, చిత్రకొండ జలాశయంలో 36 మంది ఆంధ్ర గ్రేహౌండ్స్ జవాన్ల హత్య, ఐఏఎస్ అధికారి వినీల్ కృష్ణ కిడ్నాప్, బీఎస్‌ఎఫ్ క్యాంప్‌లపై దాడులు, ఇన్‌ఫార్మర్ల నెపంతో గిరిజనుల హత్య తదితర ఘటనల్లో రవి ప్రధాన నిందితుడు. గంపకొండ వద్ద పోలీస్ వాహనం మందుపాతరతో పేల్చి 16 మంది పోలీసుల మృతికి కారకుడయ్యాడు.

 

 భారీగా ఆయుధాలు లభ్యం

 ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో మూడు ఏకే 47లు, 4 ఎస్‌ఎల్‌ఆర్‌లు, రెండు ఇన్‌సెన్స్ , ఏడు 303, నాలుగు సింగిల్ బ్యారెల్ గన్స్, మూడు పిస్టళ్లు, ఒక గ్రేనైడ్,  40 కిట్ బ్యాగ్‌లు, 2.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మావోయిస్టుల డెన్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

 

 అందరూ తెలుగు వారే..


 ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులంతా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారేనని అంటున్నారు. గాజర్ల రవి స్వస్థలం వరంగల్ జిల్లా వెలిసాల గ్రామం. వెంకట రమణ స్వస్థలం విశాఖజిల్లా హుకుంపేట మండలం బాపూరు గ్రామం. అలిపిరి దాడిలో రవితో పాటు వెంకట రమణ కూడా పాల్గొన్నట్లు సమాచారం. చలపతి స్వస్థలం చిత్తూరు జిల్లా మత్యం పైపల్లె గ్రామం. చలపతి భార్య అరుణది విశాఖ జిల్లా పెందుర్తి ప్రాంతం. అరుణ కుటుంబ స్వస్థలం విజయవాడ సమీపంలోని మహంతిపురం. దయన్న స్వస్థలం నల్గొండ జిల్లా. శ్రీకాకుళం జిల్లా బాతుపురానికి చెందిన చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న, అతని భార్య మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు కుందనాలు అలియాస్ సునీత, బాతుపురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (మెట్టూరి జోగారావు అలియాస్ కోటేశ్వరరావు) ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెం దారు. గాజర్ల రవిపై రూ.25లక్షల రివార్డు ఉండగా, వెంకటరమణపై రూ.20 లక్షలు రివార్డు ఉంది. మిగిలిన వారిపై కూడా రూ.15 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రివార్డు ఉందని చెబుతున్నారు. డీసీఎంలపై రూ.4 లక్షలు చొప్పున, ఏసీఎంలపై రూ. లక్ష చొప్పున రివార్డులు ఉన్నాయి.

 

 తప్పించుకున్న ఆర్కే.. తనయుడు హతం..

 ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడైన అక్కిరాజు  హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తప్పించుకున్నారు. ఆర్కే పలుమార్లు ఇలా తృటిలో తప్పించుకున్న సంగతి తెల్సిందే. ఇటీవలే మావో ఉద్యమంలో చేరిన ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందినట్టుగా భావిస్తున్నారు. మృతుల్లో 11మంది మహిళా మావోయిస్టు నేతలు ఉన్నారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలైన గాజర్ల రవి అలియాస్ గణేష్, డాకూరి వెంకట రమణ అలియాస్ ఉదయ్, శ్యామల కిష్టయ్య అలియాస్ దయన్న, ప్రమీలా (ఉదయ్ భార్య), చలపతి, అరుణ(చలపతి భార్య), రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, కిరణ్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా, ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 24 మందిలో ఇప్పటికి 11 మందిని మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన 13 మందిని గుర్తించేందుకు అన్ని పోలీస్‌స్టేషన్లకు మృతుల ఫొటోలు పంపారు.  

 

 కానిస్టేబుల్ కుటుంబాలకు డీజీపీ పరామర్శ

 విశాఖ నగరానికి వచ్చిన డీజీపీ సాంబశివరావు తొలుత ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశమై ఎన్‌కౌంటర్‌పై పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం నేరుగా సెవెన్ హిల్స్‌కు వెళ్లి గాయపడిన శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన కానిస్టేబుల్ సతీష్‌ను పరామర్శించారు. కేజీహెచ్‌కు వెళ్లి అబుబారక్ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా గాజువాక బీసీ రోడ్‌లో అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను డీజీపీ ఓదార్చారు. చనిపోయిన అబుబారక్ కుటుంబానికి స్పెషల్ ఎక్స్‌గ్రేషియా రూ.40లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

 

 కూంబింగ్ కొనసాగుతూనే ఉంది: డీజీపీ

 ఏఒబీలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విశాఖ చేరుకున్న ఏపీ డీజీపీ సాంబశివరావు తాజా పరిస్థితిని అక్కడినుంచే సమీక్షిస్తున్నారు. ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ ‘సంఘటనా స్థలంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. కాల్పులను విరమించి లొంగి పోవాల్సిందిగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మావోయిస్టులు పట్టించుకోవడం లేదు. కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. ఎదురుకాల్పులు, గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఎదురు కాల్పుల్లో ఇరువురు మావోయిస్టులతో సహా పలువురు కానిస్టేబుల్స్‌కు కూడా గాయాలైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు 24మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కమాండో ఒకరు మృతి చెందినట్టు డీజీపీ నిర్ధారించారు.

 

 ప్రతీకారం తీర్చుకుంటాం

 మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

 సాక్షి, హైదరాబాద్: ఏవోబీలో మావోయిస్టుల మృతి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపి.. మావోయిస్టులను హతమార్చారని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టుల మృతి, పోలీసు కాల్పుల ఘటనపై తక్షణమే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top