ఆరెస్సెస్ నేతలతో అమిత్‌షా భేటీ

ఆరెస్సెస్ నేతలతో అమిత్‌షా భేటీ - Sakshi


నాగ్‌పూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఒకరోజు పర్యటన కోసం నాగ్‌పూర్‌కు వచ్చిన ఆయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, రాజ్యసభ ఎంపీ అజయ్ సంచేతితో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలసి బీజేపీ అధికారాన్ని చేపట్టడం, ప్రమాణ స్వీకారం తర్వాత పీడీపీ నేత, కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 8 గంటలపాటు షా.. వారితో సమాలోచనలు జరిపారు. పాక్‌లోని ఉగ్రవాద గ్రూపులు సహకరించడం వల్లే కశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ముఫ్తీ వ్యాఖ్యానించడం తెలిసిందే.


అయితే ఆయన వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని కేంద్రం వివరణ ఇచ్చినప్పటికీ బీజేపీలో ఇది చర్చనీయాంశమైంది. ఆరెస్సెస్ నేతలతో భేటీ అనంతరం షా విలేకరులతో మాట్లాడలేదు. సయీద్ వ్యాఖ్యలతోపాటు జమ్మూకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ కూటమి రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ), ఆర్టికల్ 370, కేంద్రం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లు తదితర అంశాలపై ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. సాయంత్రం రాష్ర్ట పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం అమిత్ షా ఢిల్లీకి తిరిగివెళ్లారు. ఉదయమే నాగ్‌పూర్ చేరుకున్న అమిత్‌ను ఇక్కడి రవిభవన్ కాటేజీలో మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత షా నాగ్‌పూర్ రావడం ఇది రెండోసారి. ఈనెల మూడోవారంలో నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన ‘ప్రతినిధి సభ’ కూడా జరగనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top